కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు విశ్వేశ్వరయ్య కెనాల్‌లో పడటంతో నలుగురు మహిళలు మృతిచెందారు.

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు విశ్వేశ్వరయ్య కెనాల్‌లో పడటంతో నలుగురు మహిళలు మృతిచెందారు. వీరంతా మైసూరు జిల్లా టి నరసిపూర్ తాలూకాకు చెందినవారిగా గుర్తించారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో అరసికెరె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గామనహళ్లి గ్రామ శివారులో కారు అదుపు తప్పి తురుగనూరు బ్రాంచి వద్ద విశ్వేశ్వరయ్య కాలువలో పడిపోయింది. డ్రైవర్ మనోజ్ ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. 

మృతులు మహదేవమ్మ, ఆమె బంధువులు రేఖ, సంజన, మహాదేవిగా గుర్తించారు. వీరంతా మైసూరు జిల్లా టి నరసిపూర్ తాలూకాకు చెందినవారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్టుగా పేర్కొన్నారు. అయితే కాలువ ఒడ్డున పెరిఫెరల్ గోడ లేకపోవడం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 

ఇక, మృతుల్లో ఒకరైన మహదేవమ్మ ఆదిచుంచనగిరిలో తన ఇంట్లో జరిగే కార్యక్రమానికి బంధువులను ఆహ్వానించేందుకు.. ఆమె ముగ్గురు బంధువులతో కలిసి గొరవనహళ్లి నుంచి దొడ్డమలగుడి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.