సారాంశం
BJP Congress Letter War: బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత రైల్వేల నిర్వహణలోపంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ట్రిపుల్ రైలు ప్రమాదంలో 275 మందికి న్యాయం జరిగేలా ప్రమాదానికి గల అసలు కారణాన్ని బయటకు తీసుకురావాలని ఈ లేఖ ద్వారా కోరారు. ఖర్గే లేఖపై నలుగురు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాశారు.
BJP Congress Letter War: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటి. దీంతో ఈ ఘటనపై రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత రైల్వేల నిర్వహణ లోపాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ట్రిపుల్ రైలు ప్రమాదంలో 275 మందికి న్యాయం జరిగేలా ప్రమాదానికి గల అసలు కారణాన్ని బయటకు తీసుకురావాలని ఈ లేఖ ద్వారా కోరారు. ఈ లేఖకు ప్రతిస్పందనగా.. నలుగురు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాశారు. లేఖ రాసిన బీజేపీ ఎంపీల్లో తేజస్వి సూర్య, పీసీ మోహన్, ఎస్ మునిస్వామి, సదానంద గౌడ ఉన్నారు.
ఖర్గే లేఖలో వాక్చాతుర్యం ఎక్కువ, వాస్తవాలు తక్కువ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే .. ప్రధాని మోదీకి రాసిన లేఖను బీజేపీ ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. ఖర్గే లేఖలో “వాక్చాతుర్యం ఎక్కువ, వాస్తవాలు తక్కువ” అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరు రాసిన లేఖలో రాజకీయ రౌడీయిజం ఎక్కువగా ఉందని, మీరు లేవనెత్తిన ప్రశ్నల్లో వాస్తవాలు లేవని చెప్పాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు.
రైల్వేలో నియామకాల కొరతను బీజేపీ ఎంపీలు తిరస్కరించారు. గత తొమ్మిదేళ్లలో రైల్వేలో 4.58 లక్షల నియామకాలు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 1.52 లక్షల మంది నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో తాము 6.1 లక్షల మంది అభ్యర్థులను నియమించబోతున్నామనీ, ఇది UPA నియమించిన 4.11 లక్షల మంది అభ్యర్థుల కంటే దాదాపు 50% ఎక్కువ అనీ, అలాగే కొత్తగా 5,518 మంది అసిస్టెంట్ లోకో పైలట్‌లను నియమించామని, ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్న మీ ఆరోపణను తోసిపుచ్చుతున్నామన్నారు.
వాట్సాప్ యూనివర్సిటీ
వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాస్తవాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఆరోపణలు చేయకూడదనీ, 2023 ఫిబ్రవరిలో ప్రస్తావించిన ఘటనపై రైల్వేశాఖ క్షుణ్ణంగా విచారణ జరిపిందని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామనీ, నిర్వహణను ఖచ్చితంగా అమలు చేయడంపై సిబ్బందిందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. ఖర్గే(మీ) లేఖలో పేర్కొన్నట్లు మైసూర్‌లో ఎలాంటి ఘర్షణ జరగలేదని, "వాట్సాప్ యూనివర్సిటీ" లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రధానమంత్రికి లేఖ రాయడం మీ స్థాయి నాయకుడికి సరిపోదనీ, కానీ బహుశా "WhatsApp విశ్వవిద్యాలయం" వైస్ ఛాన్సలర్‌గా మీరు నకిలీ వార్తలను వాస్తవంగా రూపొందించవలసి వచ్చిందని ఏద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధినేత ఖర్గేకు చురకలంటిస్తూ..మీరు రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతను నిర్వహించారు. కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ స్వతంత్ర,చట్టబద్ధమైన అథారిటీ అని మీరు తప్పక తెలుసుకోవాలి, ఇటీవల 2022లో CRS పోస్ట్‌ను అత్యున్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కమిషన్ మరింత బలోపేతం చేయబడిందని తెలిపారు.
అసంపూర్ణ గణాంకాలు
బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించలేదని కాగ్ నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ ఆరోపించిందని, భద్రతకు సంబంధించిన ముఖ్యమైన పనుల కోసం బీజేపీ హయాంలో రాష్ట్రీయ రైల్ సురక్షా కోష్ (ఆర్‌ఆర్‌ఎస్‌కే)ని ఏర్పాటు చేశారని బీజేపీ ఎంపీలు తెలిపారు. 2017-18 నుంచి 2021-22 మధ్య రైల్వేలు RRSK కోసం రూ. 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం RRSK యొక్క చెల్లుబాటును 2022-23 నుండి మరో ఐదేళ్లపాటు పొడిగించింది. మీరు రైల్వే మంత్రిగా ఉన్నారని, ఈ మొత్తం మీ వాదనలు తప్పని రుజువు చేస్తున్నాయని ఎంపీలు రాశారు.
గత తొమ్మిదేళ్లలో రైల్యే మొత్తం భద్రతా వ్యయం రూ. 1,78,012 కోట్లు, ఇది మీ పదవీకాల వ్యయం కంటే 2.5 రెట్లు ఎక్కువ. UPA 10 సంవత్సరాలలో ఇంత కంటే పేలవంగా పనిచేసిన తర్వాత కూడా రైలు భద్రతపై మాకు ఉపన్యాసాలు ఇవ్వగల విశ్వాసాన్ని మీరు ఎలా కలిగి ఉన్నారనేది ఆసక్తికరంగా ఉందని విమర్శించారు. ఆ లేఖలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యాంటీ కొలిజన్ డివైస్‌పై ఎంత సీరియస్‌గా మాట్లాడుతుందనేది ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.
ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ
సీబీఐ విచారణను ఖర్గే వ్యతిరేకించడంపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ.. రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రమాదంపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలో చిక్కుముడి వీడడంతో సీబీఐ విచారణ చేపట్టిందని తెలిపారు. అదేవిధంగా రైల్వేలో మూడు లక్షల ఖాళీ పోస్టుల ప్రశ్నపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో రైల్వేలో ఆరు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఇది మాత్రమే కాదు, కొత్తగా నియమితులైన 5518 లోకో పైలట్లు ఖర్గే ఆరోపణలను తిరస్కరించారు. రైల్వే బడ్జెట్‌ను ప్రతి ఏటా తగ్గిస్తున్నారనే ఆరోపణలను బీజేపీ ఎంపీలు తోసిపుచ్చారు. తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వ కృషితో రైల్వేశాఖకు కొత్త బలం చేకూరిందని అన్నారు. విద్యుదీకరణలో రికార్డు పురోగతి సాధించిందనీ, వందే భారత్ రైళ్లు ప్రారంభించబడ్డాయనీ, దాదాపు 1,275 స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేయబడుతున్నాయని తెలిపారు.
ఖర్గే తీవ్ర ప్రశ్నలు
రైల్వేలను ప్రాథమికంగా బలోపేతం చేయడానికి బదులుగా, వార్తల్లో నిలిచేందుకు మాత్రమే మార్పులు చేస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తరచూ తప్పుడు నిర్ణయాల వల్ల రైలు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఖర్గే ఆరోపించారు. రైల్వేలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. ఘటన జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా 8,278 ఖాళీలు ఉన్నాయి. చాలా మంది సీనియర్ పోస్టులు కూడా ఇవ్వలేదని ఖర్గే పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఈ ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని ఖర్గే ప్రశ్నించారు. సిబ్బంది కొరత కారణంగా లోకో పైలట్‌లు ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తోందన్న వాస్తవాన్ని రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించిందని ఖర్గే లేఖలో రాశారు. రైల్వే భద్రతకు లోకో పైలట్లే ముఖ్యమని, అయితే ..ఆ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ఖర్గే ప్రశ్నించారు.
ఫిబ్రవరి 8, 2023న మైసూర్‌లో జరిగిన ప్రమాదం తర్వాత.. రైల్వే సిగ్నల్ సిస్టమ్‌ను సరిచేయాలని సౌత్ వెస్ట్ జోనల్ రైల్వే ఆపరేషన్స్ అధికారి చెప్పారని, అయితే ఆ హెచ్చరికను రైల్వే మంత్రిత్వ శాఖ ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు నిలదీశారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సలహాను రైల్వే బోర్డు విస్మరించిందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ అధినేత పేర్కొన్నారు. కేవలం 8-10 శాతం రైలు ప్రమాదాలను మాత్రమే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సిఆర్‌ఎస్) విచారిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సీఆర్‌ఎస్‌ను పటిష్టంగా, స్వయంప్రతిపత్తిగా మార్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఖర్గే ప్రశ్నించారు. ట్రాక్ నిర్వహణ పట్టించుకోలేదని ఖర్గే ఆరోపించారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో ఎందుకు విలీనం చేశారని ఖర్గే ప్రశ్నించారు. ఇది రైల్వేల స్వయంప్రతిపత్తిని, నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసిందని ఖర్గే అన్నారు.
సీబీఐ దర్యాప్తుపై కూడా ప్రశ్నలు
ఒడిశా రైలు ప్రమాదానికి మూలకారణాన్ని కనుగొన్నామని రైల్వే మంత్రి చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణ ఎందుకు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. రైల్వేలో సాంకేతిక, భద్రత, సిగ్నలింగ్ నిపుణుల కొరత ఉందని ఖర్గే అన్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, అయితే రైలు ప్రమాదం సాంకేతిక, సంస్థాగత , రాజకీయ వైఫల్యమని, ఈ విషయంలో సీబీఐ విచారణతో జవాబుదారీతనం సరికాదని ఖర్గే అన్నారు.
శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్నాయనే విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఇదొకటి.