Ex Minister Ashwani Kumar: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్‌ కాంగ్రెస్​ను వీడారు.    

Ex Minister Ashwani Kumar: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశారు. పార్టీకి గుడ్​బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమన్నారు. ఆలోచనాత్మకంగా పరిశీలించిన తరువాత.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్య‌క్తిగ‌త గౌరవార్థం.. పార్టీని వీడివెళ్ల‌డ‌మే ఉత్తమంగా భావించనని తెలిపారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు ఊహించిన ఉదార ​​ప్రజాస్వామ్య వాగ్దానాల ఆధారంగా.. పరివర్తన నాయకత్వ ఆలోచనతో ప్రేరణ పొంది.. ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

అశ్వనీకుమార్ సోనియాకు విధేయుడిగా, నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ ఆయ‌న కొనసాగారు. ఆయన తొలుత‌ 1976లో గురుదాస్‌పూర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ ఆఫీస్‌ బేరర్‌గా పని చేశారు. 1990లో చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నియామకమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి, స్పీకర్‌గా పని చేశారు. అశ్వనీకుమార్‌ 2002లో రాజ్యసభకు ఎన్నికవగా.. 2016 వరకు కొనసాగారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ఆయ‌న అత్యంత సన్నిహితుడు. 2006లో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2011లో మళ్లీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రి, అనంత‌రం 2009 - 2014 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయ మంత్రిగా ప‌నిచేశారు. తాజాగా మాజీ మంత్రి సైతం గుడ్‌బై చెప్పడం పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు
భావిస్తున్నారు. 

 గ‌త నెల‌లో ఉత్తరప్రదేశ్‌లో మాజీ కేంద్ర మంత్రి, ఆగ్ర‌ నాయకుడు ఆర్‌పిఎన్ సింగ్ పార్టీని వీడిన విష‌యం తెలిసిందే. గతేడాది యూపీలోని మరో కీలక నేత జితిన్ ప్రసాద పార్టీని వీడారు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చేరారు. అలాగే గ‌తేడాది పంజాబ్ కాంగ్రెస్ కు మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్ రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే.