రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ మాధవ్ గాడ్‌బోలే చనిపోయారు. ఆయన ఇంట్లోనే గుండెపోటుతో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన సర్వీసులో అనేక ముఖ్య శాఖలకు కార్యదర్శిగా పని చేశారు. 

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ మాధవ్ గాడ్‌బోలే (85) సోమవారం గుండెపోటుతో తన నివాసంలో కన్నుమూశారు. ఆయ‌న ఒక రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) ఆఫీస‌ర్. గాడ్‌బోలే 1993లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు IAS సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

ఆయ‌న భారత ప్రభుత్వంతో పెట్రోలియం, సహజ వాయువు కార్యదర్శిగా ప‌ని చేశారు. దీంతో పాటు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కూడా సేవ‌లందించారు. ఆయ‌న మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు ఛైర్మన్‌గా, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. మనీలాలోని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ఐదేళ్లపాటు పనిచేశారు.

డాక్టర్ గాడ్‌బోలే ఎన్రాన్ పవర్ ప్రాజెక్ట్, సుపరిపాలన, భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణతో సహా అనేక ప్రభుత్వ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు రాహుల్, కూతురు మీరా, కోడలు దక్షిణ, అల్లుడు మహేష్, మనవళ్లు అదితి, మనన్, గాయత్రి, తారిణి ఉన్నారు. గాడ్‌బోలే విధాన నిర్ణయాలపై 20కి పైగా పుస్తకాలు కూడా రాశారు.