పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) నేత ప్రకాష్ సింగ్ బాదల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మోహలీ‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్టుగా ఎస్‌ఏడీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) నేత ప్రకాష్ సింగ్ బాదల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మోహలీ‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్టుగా ఎస్‌ఏడీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 94 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాదల్ శనివారం రాత్రి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక, ప్రకాష్ సింగ్ బాదల్..పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంతకు ముందు కూడా ప్రకాష్ సింగ్ బాదల్ పలు సందర్భాల్లో ఆస్పత్రిలో చేరారు.గాస్ట్రో సంబంధింత సమస్యలతో జూన్ 6న చండీగఢ్‌లోని PGIMER ఆసుపత్రిలో ఆయన చేరగా, ఆ మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. 

ఇక, ఈ ఏడాది ప్రారంభంలో ప్రకాష్ సింగ్ బాదల్‌ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను లూథియానాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి జనవరి 24న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో ఆయనను మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ కార్డియాక్, పల్మనరీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు వారాలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

ఇక, ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో లంబి స్థానం నుంచి బరిలో నిలిచిన ప్రకాష్ సింగ్ బాదల్ ఓడిపోయారు. ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఇది రెండోసారి. ఇప్పటివరకు 13 సార్లు రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ సింగ్ బాదల్.. 11 సార్లు విజయం సాధించారు. 1997 నుంచి లంబికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి పంజాబ్‌లో 2017 ఎన్నికల వరకు వరుసగా ఆ నియోజకవర్గంలో ప్రకాష్ సింగ్ బాదల్ విజయం సాధించారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు.