మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్ధోషి.. మావోయిస్టుల లింకు కేసులో బాంబే హైకోర్టు తీర్పు..
మావోయిస్టులతో సంబంధాలు (Maoist link case) ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి (Former Delhi University professor GN Saibaba acquitted) అని బాంబే హైకోర్టు (Bombay High Court) తెలిపింది. ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా నిర్దోషులే అని కోర్టు తీర్పు చెప్పింది.
మావోయిస్టుల లింక్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులు ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2017లో జీఎన్ సాయిబాబా తదితరులను దోషులుగా నిర్ధారిస్తూ నాగ్ పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ ఏ మెనెజ్ లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
2022 అక్టోబర్ 14 న హైకోర్టు ధర్మాసనం కూడా వికలాంగ ప్రొఫెసర్ ను నిర్దోషిగా ప్రకటించడంతో సాయిబాబా అప్పీల్ ను తిరిగి విచారించిన తరువాత బాంబే హైకోర్టు బెంచ్ ఈ తీర్పును ఇచ్చిందని ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది. నిందితులపై సహేతుకమైన అనుమానాలకు తావులేకుండా కేసును రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) నిబంధనల కింద నిందితులపై అభియోగాలు మోపడానికి ప్రాసిక్యూషన్ పొందిన అనుమతి చెల్లదని పేర్కొంది. ప్రాసిక్యూషన్ తన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరనప్పటికీ, వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపింది.
2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు.. సాయిబాబాతో పాటు ఓ జర్నలిస్టు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సహా మరో ఐదుగురిని మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై, దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి పాల్పడినందుకు దోషులుగా నిర్ధారించింది. యూఏపీఏ, ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది.
యూఏపీఏ కింద సరైన అనుమతి లేనందున విచారణ చర్యలు చెల్లవని పేర్కొంటూ 2022 అక్టోబర్ 14న సాయిబాబాను హైకోర్టు మరో బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అదే రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తొలుత ఈ ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత 2023 ఏప్రిల్లో హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసి సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ ను కొత్తగా విచారించాలని ఆదేశించింది. కాగా.. 54 ఏళ్ల జీఎన్ సాయిబాబా వీల్ చైర్ లో 99 శాతం వైకల్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.