సారాంశం

‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశంపై క్లారిటీ వచ్చింది.

దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశంపై క్లారిటీ వచ్చింది. ఈ సమావేశం సెప్టెంబర్ 23న జరుగుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం మీడియాకు  వెల్లడడించారు. 

దీంతో  ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’పై కమిటీ తొలి అధికారిక సమావేశం సెప్టెంబర్ 23న జరగనుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌,  మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు. 

ఇక, కమిటీ సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతుండగా, న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ప్యానెల్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రాజ్యాంగానికి నిర్దిష్ట సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సవరణలు అవసరమయ్యే ఏవైనా ఇతర చట్టాలు,  నియమాలను పరిశీలించి సిఫార్సు చేయనుందని. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమైతే దానిని కూడా కమిటీ పరిశీలించి సిఫార్సు చేస్తుంది. ఇక, కేంద్రం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సి)లో సభ్యునిగా ఎంపికైన అధీర్ రంజన్ చౌదరి ప్యానెల్‌లో పనిచేయడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన  లేఖ కూడా రాశారు. 

ఇక, ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి  తెలిసిందే. ఈ సమావేశాల్లో కేంద్రం ఒకే దేశం- ఒకే ఎన్నికలు బిల్లును తీసుకురావాలని భావిస్తున్నట్టుగా కూడా ఊహాగానాలు  వినిపించాయి.  అయితే ఈ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే జమిలి ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.