Jammu Kashmir: బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ.. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. "ఆయ‌న భార‌త్ ను ఏకం చేసే ప‌నిలో ఉన్నారు. ప్రతికూల వాతావరణంలో దేశాన్ని, దాని ప్రజాస్వామ్య సంస్థలను ఐక్యం చేయడానికి-రక్షించడానికి ముందుకు న‌డుస్తున్నారు. ఇదే స‌మ‌యంలో దేశ‌భ‌క్తుల‌మ‌ని చెప్పుకునే వారు అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మే పనిలో నిమగ్నమై ఉన్నారంటూ" బీజేపీపై మండిప‌డ్డారు. 

PDP president Mehbooba Mufti: జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ నాయ‌కురాలు మెహబూబా ముఫ్తీ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర పై ప్రశంసలు కురిపించారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంలోని అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ దాడి నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడేందుకు ఆయన పోరాడుతున్నందున ప్రజలు ఆయనకు మద్దతు ఇవ్వాలని అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన ముఫ్తీ.. "రాహుల్ గాంధీని యువరాజు అంటూ ఎగతాళి చేస్తున్నారు కానీ.. ఆయ‌న భార‌త్ ను ఏకం చేసే ప‌నిలో ఉన్నారు. ప్రతికూల వాతావరణంలో దేశాన్ని, దాని ప్రజాస్వామ్య సంస్థలను ఐక్యం చేయడానికి-రక్షించడానికి ఆయ‌న ముందుకు న‌డుస్తున్నారు. ఇదే స‌మ‌యంలో దేశ‌భ‌క్తుల‌మ‌ని చెప్పుకునే వారు అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మే పనిలో నిమగ్నమై ఉన్నారంటూ" బీజేపీపై మండిప‌డ్డారు.

అలాగే, దేశంలోని క్రీడారంగా బీజేపీ నాయ‌కుల చేతుల్లోకి వెళ్తున్న అంశంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వివిధ క్రీడా రంగాల‌కు సంబంధించి నాయకత్వం వహించడానికి బీజేపీ నాయకుల బంధువుల ఎంపిక ప్రమాణాలను కూడా ముఫ్తీ ప్రశ్నించారు. (హోం మంత్రి అమిత్ షా కుమారుడు) జై షాకు బ్యాట్ పట్టుకోవడం ఎలాగో తెలుసా? అంటూ ప్ర‌శ్నించారు. 

దేశం కోసం ప్రాణ‌త్యాగం చేసిన కుటుంబ వారిది.. 

రాహుల్ గాంధీ దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర ఉన్న గాంధీ కుటుంబం నుండి వచ్చినందున రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేస్తోందని ముఫ్తీ ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించి, జైలుకు వెళ్లి, బలమైన భారతదేశానికి పునాదులు వేసిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పరువు తీస్తున్నార‌ని అధికార‌పార్టీపై మండిప‌డ్డారు. భారత్ జోడో యాత్ర కోసం, ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి, దేశాన్ని- దాని ప్రజాస్వామ్య సంస్థలను ఏకం చేయడానికి.. రక్షించడానికి రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారంటూ మెహబూబా ముఫ్తీ ప్ర‌శంస‌లు కురిపించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యానికి బీజేపీ భయపడుతోందని ఆరోపించిన ఆమె.. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతం, ప్రాంతాల పేరుతో దేశాన్ని విభజించారని ఆరోపించారు. అలాగే, గాంధీ, బీజేపీ రాజ‌కీయ కుటుంబాల గురించి ప్ర‌స్తావించిన ఆమె.. "స్వాతంత్య్ర‌ పోరాటంలో నెహ్రూ దశాబ్దానికి పైగా జైలులో ఉన్నారు. రాహుల్ గాంధీ అమ్మమ్మ ఇందిర దేశం కోసం ఎంతో సేవ చేశారు. రాహుల్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన ఒక్క‌ బీజేపీ నాయకుడి పేరు చెప్పండి.. ప్రాణత్యాగం చేయడం పక్కనపెట్టి.. మీరు బాలాకోట్ (పాకిస్థాన్‌లో) వెళ్లి 2019 (పార్లమెంటరీ) ఎన్నికల్లో గెలవడానికి దాన్ని ఉపయోగించుకున్నారు" అని ముఫ్తీ ఆరోపించారు. 

దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ..

ఫిబ్రవరి 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సరిహద్దు వెంబడి వైమానిక దళం జరిపిన దాడులను ప్రస్తావిస్తూ.. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం దాన్ని ఉప‌యోగించుకున్నార‌ని ఆరోపించారు. అలాగే, దేశంలో "అత్యంత అవినీతి పార్టీ బీజేపీనే అని పేర్కొన్నారు. “... భూమ్మీద అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే. గడిచిన ఎనిమిదేళ్లలో అత్యంత ధనిక పార్టీగా ఎలా అవతరించింది?" అని పీడీపీ నాయ‌కురాలు మెహ‌బూబా ముఫ్తీ ప్ర‌శ్నించారు. పార్టీ ధనబలం ఉపయోగించి ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తోందని ఆరోపించారు. "ప్రజలు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఎన్‌ఐఏ, కరప్షన్ బ్యూరో తమ ప్లాన్‌కు అనుగుణంగా డెలివరీ చేయడంలో విఫలమైన తర్వాత ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లకు కొంటున్నారు’’ అని ఆమె ఆరోపించింది.