భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ బీజేపీలో చేరారు. కేరళలోని కన్నూర్‌లో ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

మాధవన్ నాయర్‌తో పాటు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జి.రమణ నాయర్, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ ప్రమీలా దేవి, జేడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కారాకులం దివాకరన్ నాయర్, మలంకార చర్చికి చెందిన థామస్ జాన్ కూడా బీజేపీలో చేరారు.

అనంతరం మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. కొద్దికాలంగా తాను భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్నానని.. అమిత్ షా తనను లాంఛనంగా పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. దేశాభివృద్ధి విషయంలో మోడీ విజన్ నచ్చి తాను బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు.  

మాధవన్ నాయర్ హయాంలో ఇస్రో పలు కీలక ప్రయోగాలు చేపట్టింది.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-1 దీనిలో ఒకటి. అంతకు ముందు ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగానూ.. స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గానూ పనిచేశారు. భారత అంతరిక్ష రంగానికి మాధవన్ నాయర్ చేసిన సేవలకు గాను.. కేంద్రప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.