రాజకీయాల్లోకి భారత మాజీ క్రికెటర్.. టీఎంసీ తరఫున లోక్ సభ బరిలో యూసుఫ్ పఠాన్
భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయనకు టీఎంసీ బహరంపూర్ టికెట్ కేటాయించింది.
భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి రానున్నారు. ఆయనను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 2024 లోక్ సభ బరిలో నిలిపింది. పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉంటారని టీఎంసీ స్పష్టం చేసింది.
అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురి పోటీలో ఉన్నారు. కాగా.. భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత కీర్తి ఆజాద్ కు కూడా టీఎంసీ టికెట్ ఇచ్చింది. ఆయనను దుర్గాపూర్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది.
కీర్తి ఆజాద్ గతంలో 2014 లోక్ సభ ఎన్నికల్లో దర్భంగా నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు. అయితే 2018లో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలం తరువాత ఆ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. 2021లో టీఎంసీలో చేరారు.