ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిధిని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్ పై ముందుగా ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజల, ఇతర పార్టీల నాయకుల దృష్టి పడేలా చూసుకుంటోంది. పలువురు నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానా కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడిగా ఉండి గతేడాది టీఎంసీలో చేరిన అశోక్ తన్వర్ ను కూడా పార్టీలో చేర్చుకోబోతోంది.
కాంగ్రెస్ మాజీ నేత అశోక్ తన్వార్ సోమవారం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరనున్నారు. పంజాబ్‌లో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి జోరు మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు హర్యానాపై దృష్టి పెట్టింది. 2024లో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ తన్వర్ ను పార్టీలో చేర్చుకోనుంది.
హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంటు సభ్యుడైన తన్వర్ 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (HPCC) అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన్వర్ గతంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ (INYC) ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితుడిగా ఉండేవాడు. అశోక్ తన్వర్ INYC, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
2021 ఫిబ్రవరి నెలలో ఆయన ‘అప్నా భారత్ మోర్చా’ అనే కొత్త రాజకీయ పార్టీని కూడా ప్రారంభించాడు. అయితే గతేడాది నవంబర్ 23వ తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని ఢిల్లీలో సందర్శించినప్పుడు తన్వర్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో జేడీ (యూ) మాజీ ఎంపీ పవన్ వర్మ, కాంగ్రెస్ నాయకుడు కీర్తి ఆజాద్ కూడా తన్వర్‌తో పాటు టీఎంసీలో చేరారు. ‘‘ బీజేపీ దుష్పరిపాలనతో దేశం మొత్తం విసిగిపోయింది. ఈ శక్తులను ఓడించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ మాత్రమే అని నేను భావిస్తున్నాను. టీఎంసీ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. పార్టీ కొత్త సంకల్పంతో ముందుకు సాగుతోంది.’’ అని తన్వర్ ఆ సమయంలో చెప్పారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో TMC పేలవమైన ప్రదర్శన వెనుక కారణాలను పరిశీలించడానికి తన్వర్‌ను ఇటీవల ఒక కమిటీకి అధిపతిగా కూడా నియమించారు. కాగా అయితే ఆయన సోమవారం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇతర పార్టీల నుంచి పలువురు స్థానిక నాయకులు AAPలో చేరారు.
ఇదిలావుండగా ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అహ్మాదాబాద్ ను సందర్శించారు. ముందుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు ఇచ్చినట్టుగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా ఆదివారం మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారని అన్నారు. ఇక్కడి ప్రజలు నిజాయితీగల పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాకతో ప్రజల్లో ఆశలు చిగురించాయని అన్నారు.
