న్యూఢిల్లీ:  ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి తెలియజేసింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ అశోక్ లావాలా ఆగస్టు 31వ తేదీన పదవి నుంచి తప్పుకుంటున్నారు. 

అశోక్ లావాసా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరబోతున్నారు. రాజీవ్ కుమార్ జార్ఖండ్ క్యాడర్ కు చెందిన 1984వ బ్యాచ్ రిరైర్డ్ ఐఎస్ అధికారి. రాజీవ్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సునీల్ అరోరా వ్యవహరిస్తున్నారు. సుశీల్ చంద్రతో పాటు రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉంటారు. రాజీవ్ కుమార్ కు వివిధ రంగాల్లో ప్రభుత్వ విధానాల రూపకల్పన, పాలనా నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 

రాజీవ్ కుమార్ బిఎస్సీ, ఎల్ఎల్బీ చేశారు. ఆయన పబ్లిక్ పాలసీ అండ్ సస్టైన్ బిలిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. నిరుడు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రధాన మంత్రి జన ధన యోజన, ముద్ర రుమాల పథకం వంటివాటి రూపకల్పనలో ఆయన కీలక భూమిక పోషించారు. 

62 ఏళ్ల లావాసా 2018లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.