న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా శనివారం రాత్రి కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 82 ఏళ్లు.

ఖురానా శనివారం రాత్రి 11 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు హరీష్ ఖురానా చెప్పాడు. గత కొద్ది రోజులుగా ఆయన ఛాతీ ఇన్ ఫెక్షన్ తోనూ జ్వరంతోనూ బాధపడుతున్నారు. బిజెపి నేత అయిన ఖురానా నాలుగు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1993 నుంచి 1996 వరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2004లో కొద్ది కాలం రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. 

ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు విమల్ ఖురానా గుండెపోటుతో ఆగస్టులో మరణించాడు. ఆదివారంనాడు ఖురానా భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. ఖురానా మృతికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.