కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్టుగా సమాచారం. కుమారస్వామికి గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన కారణంగా జ్వరం వచ్చిందని, తీవ్ర అలసట ఏర్పడిందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జయనగర్‌లోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో హెచ్‌డీ కుమారస్వామికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అయితే గతంలో కుమారస్వామికి గుండె శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో.. ఆయన ఆరోగ్యంపై జేడీఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కుమారస్వామి త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. ఈ మేరకు జయనగర్‌లోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు.. కుమారస్వామి ఆరోగ్యంపై బులిటెన్ కూడా విడుదల చేశాయి.
‘‘ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున 3.40 గంటలకు నీరసం, అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ సతీష్ చంద్ర నేతృత్వంలోని బృందం ఆయన చికిత్స అందిస్తుంది. ఆస్పత్రికి రాగానే ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహించాం. ఆయన బాగా స్పందిస్తున్నారు. హేమోడైనమిక్‌గా స్థిరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచాం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తదుపరి అప్‌డేట్‌లను నిరంతరం తెలియజేస్తాం. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దాం’’ అని కుమారస్వామి హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
