Asianet News TeluguAsianet News Telugu

ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచర్య భార్య సోదరి.. ‘వీఐపీ హోదా వద్దు’

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచర్య సతీమణి మీరా సోదరి ఇరా బసు ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నారు. వైరాలజీలో పీహెచ్‌డీ చేసి ఇంగ్లీష్, బెంగాలీలో స్పష్టంగా మాట్లాడే ఇరా బసు స్కూల్‌‌లో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత దయనీయ స్థితికి చేరుకున్నారు. అయినప్పటికీ సీఎం నుంచి సహాయాన్ని ఆశించలేరు. కనీసం పెన్షన్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేరు. అంతేకాదు, తనకు వీఐపీ హోదా వద్దన్నారు.

former CM Buddhadeb Bhattacharya sister in law living on footpath
Author
Kolkata, First Published Sep 10, 2021, 5:03 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లు సీఎంగా వ్యవహరించిన బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా సోదరి ఇరా బసు. ఆమె ప్రస్తుతం దయనీయ స్థితిలో ఫుట్‌పాత్‌లపై జీవిస్తున్నది. ఫుట్‌పాత్‌పై పడుకుని వీధి వ్యాపారుల దగ్గర నుంచి ఆహారం తీసుకుంటున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన బారాబజార్ ఏరియాలోని డన్లప్ వీధుల్లో చింపిరి జుట్టుతో నలిగిన నైట్‌గౌన్‌తో యాచకురాలి స్థితిలో ఆమె కనిపించారు. ఆమె స్వయంగా వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఆంగ్లం, బెంగాలీ స్పష్టంగా మాట్లాడగలరు. ఇప్పుడు ఫుట్‌పాత్‌పై పడటం చర్చనీయాంశమైంది.

ఇరా బసు 1976లో ప్రియనాథ్ గర్ల్స్ హైస్కూల్‌లో లైఫ్ సైన్సెస్ టీచర్‌గా చేరారు. 2009లో రిటైర్ అయ్యారు. అప్పటికీ బుద్ధదేవ్ ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారు. రిటైర్‌మెంట్ సమయంలో ఆమె బారానగర్‌లో నివసించారు. తర్వాత ఖర్దాహ్‌లోని లిచు బగన్‌కు మారారు. అనంతరం పతా లేకుండా పోయారు. చివరికి డన్లప్ వీధుల్లో దౌర్భాగ్య స్థితిలో కనిపించారు.

ఇరా బసుకు తన కాళ్లమీద తాను నిలబడటం ఇష్టం. తన సోదరి భర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రానా ఆయన నుంచి ఫేవర్ తీసుకోవాలని దురాశ లేదు. అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి సహాయం పొందాలని నేను కోరుకోలేదని ఇరా బసు స్వయంగా వెల్లడించారు. ఈ ఉద్యోగాన్నీ తన సొంత టాలెంట్‌తో పొందారని, తనకు వీఐపీ గుర్తింపు వలదని చెప్పారు. అయినప్పటికీ చాలా మంది తమ కుటుంబం గురించి ఆరా తీస్తుంటారని వివరించారు. కొంతలో కొంతైనా మెరుగ్గా జీవించడానికి అటువైపు నుంచి ఏ సహాయాన్ని ఆమె ఆశించలేదు. ప్రభుత్వాల నుంచి పెన్షన్ కూడా తీసుకోవాలనుకోలేదు. దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినా ఆమె పట్టించుకోలేదు. స్వతహాగా పై చదువులు చదివిన ఆమె ఇప్పుడీ దయనీయ స్థితిలో కనిపించడం ఇబ్బందికర పరిణామంగా మారింది.

ప్రియానాథ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ పెన్షన్ దరఖాస్తు చేయడానికి డాక్యుమెంట్లు అడగ్గా ఇరా బసు తిరస్కరించారు. మళ్లీ ఆ స్కూల్‌లో పనిచేయడానికి అవకాశమిచ్చినా నిరాకరించారు. కానీ, ఆమె చదువు నేర్పిన విద్యార్థులు ఇప్పటికీ ఆమెను మరిచిపోరు. ఈ సెప్టెంబర్ 5న ఆమెను కలుసుకుని సన్మానించి స్వీట్లు పంచి వెళ్లారు. ‘నా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇప్పటికీ నేనంటే ఎంతో మమకారం. కొంత మంది విద్యార్థులు నేను కనిపిస్తే ఏడుస్తారు. నన్ను హగ్ చేసుకుంటారు’ అని ఇరాబసు తెలిపారు.

ప్రస్తుతం ఇరా బసు దయనీయ స్థితికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమై అంబులెన్స్ పంపారు. ఆమెను డన్లప్ ఏరియా నుంచి బారానగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మెడికల్ చెకప్, ట్రీట్‌మెంట్ కోసం కోల్‌కతాలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వయసు మీదపడినప్పటికీ ఆమెకు ఇప్పటికీ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆన్‌లైన్ క్లాసులను తనను సపోర్ట్ చేయబోరని, విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. ప్రాక్టికల్‌గా విద్యార్థులు ఏమీ నేర్చుకోలేకపోతున్నారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios