న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం నాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గొగోయ్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేటీఎస్ తులసీ రిటైర్మెంట్ కావడంతో గొగోయ్ ను నామినేట్ చేశారు. 13 మాసాల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా గొగోయ్ పనిచేశారు. పలు కీలకమైన కేసుల్లో గొగోయ్ కీలక తీర్పులు ఇచ్చారు. ఎన్ఆర్‌సీ, శబరిమల, రాఫెల్ లాంటి కేసుల్లో గొగోయ్ కీలక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే.

రంజన్ గొగోయ్ ను రాజ్యసభ సభ్యుడిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గొగోయ్ ప్రమాణం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రాజ్యసభ నుండి వాకౌట్ చేశారు. 

విపక్షాలు రాజ్యసభ నుండి వాకౌట్ చేయడాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు.రాజ్యసభకు గొగోయ్ ను నామినేట్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలకు దిగింది.