రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల బారిన పడి ఎందరో కోట్లాది రూపాయల సోమ్ము పొగొట్టుకుంటున్నారు. ఇందుకు ప్రముఖులు సైతం అతీతులు కాదు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా కూడా బాధితుల జాబితాలో చేరిపోయారు.

వివరాల్లోకి వెళితే.. లోథా ఆర్ధిక లావాదేవీలపై కన్నేసిన హ్యాకర్స్.. ఆయన ఫ్రెండ్స్ లిస్టులోని జస్టిస్ బీసీ సింగ్ ఈ మెయిల్‌ను హ్యాక్ చేశారు లక్ష రూపాయాలు దోచుకున్నారు. దీనిని గ్రహించిన జస్టిస్ లోథా ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏప్రిల్ 19న నాకు బీపీ సింగ్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలని అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదు.

దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ఉన్నారు కదా అని వెంటనే లక్ష రూపాయలు ఆన్‌లైన్ ద్వారా పంపించాను అని జస్టిస్ లోథా ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్టిస్ బీపీ సింగ్ తన ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించడంతో.. ఇది సైబర్ నేరగాళ్ల పని అయివుంటుందని గమనించారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన లోథాకు సూచించారు. చీటింగ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు  చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.