న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు తిరునెల్లై నారయణ్ అయ్యర్ శేషన్. ఆయన వయస్సు 87 ఏళ్లు. పలు ఎన్నికల సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు. 

టీఎన్ శేషన్ 1990 డిసెంబర్ 12వ తేదీ నుించి 1996 డిసెంబర్ 11వ తేదీ వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు. భారతదేశానికి ఆయన పదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశారు. టిఎన్ శేషన్ 1932 డిసెంబర్ 15వ తేదీన తిరునెల్లైలో జన్మించారు. పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత ఆయన కేఆర్ నాయణన్ మీద రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టింది ఆయనే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకులకు ఆయన సింహస్వప్నంగా మారారు. తన కుమారుడి కోసం గవర్నర్ ప్రచారం చేసినందుకు మధ్యప్రదేశ్ లోని ఓ నియోజకవర్గం ఎన్నికలను ఆయన సస్పెండ్ చేశారు. చివరకు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఎన్నికల సమయానికి మించి ప్రచారం చేస్తున్న స్థితిలో శేషన్ కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మంత్రి వేదిక దిగిపోవాల్సి వచ్చింది. శేషన్ 1955 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ కు చెందినవారు. 

శేషన్ 1989లో క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారు .ప్రభుత్వంలో అందించిన సేవలకు గాను ఆయనకు 1996లో రామన్ మెగషేసే అవార్డు లభించింది.