Bhagwant Mann: విదేశీయులు కూడా ఉద్యోగాల కోసం పంజాబ్‌కు వస్తారని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. పంజాబ్ 'బ్రెయిన్ డ్రెయిన్' గురించి మాట్లాడుతూ.. విదేశీయులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. అయితే.. విదేశీయులకు ఉద్యోగాల ఇవ్వడం కాదు.. రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు విరుచుకపడ్డాయి.
Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వివాదంలో చిక్కుకున్నారు. విదేశీయులు కూడా ఉద్యోగాల కోసం పంజాబ్‌కు రావొచ్చునని, ఉపాధి పొందొచ్చని వ్యాఖ్యానించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన శనివారం బటిండాలోని మహారాజా రంజిత్ సింగ్ టెక్నికల్ యూనివర్సిటీలో తొలి స్నాతకోత్సవం జరిగింది. ఆయన వెంట గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ పంజాబ్ నుంచి మేధో వలసల(బ్రెయిన్ డ్రెయిన్)ను నివారించాలని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, మాన్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కానీ, సీఎం వ్యాఖ్యలపై ప్రధాన విపక్ష కాంగ్రెస్ మండి పడింది. పంజాబ్‌కు విదేశీయులను ఆహ్వానించడానికి ముందు రాష్ట్రంలో సమస్యలపై దృష్టి సారించాలని హితవు చెప్పింది.
సీఎం భగవంత్‌మాన్ మీడియాతో.. ప్రతిఏటా మూడు లక్షల మంది పిల్లలు విదేశాలకు వెళుతున్నారు. ఈ ఏడాది కూడా 3 లక్షల మంది పిల్లలు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కేవలం పిల్లలు మాత్రమే కాదు. ఒక వ్యక్తిపై ప్రభుత్వం రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నది. వారు విదేశాలకు వెళ్లిపోవడంతో ఒక్కొక్కరిపై రూ.15 లక్షలు వృథా ఖర్చు చేయాల్సివస్తుంది. కొంత సమయం ఇవ్వండి, పంజాబ్‌లో ఉద్యోగాల కోసం విదేశీయులు వచ్చే వాతావరణాన్ని మేము సృష్టిస్తామని అంటున్న వీడియో క్లిప్‌ను భగవంత్ మాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మేధోవలస తప్పనిసరిగా నివారించాల్సిందే. ఏ ఒక్కరూ ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భగవంత్‌మాన్ అన్నారు. యువత విదేశాలకు వెళ్లొద్దని కోరారు. విదేశాలకు వెళ్లిన యువకులు తిరిగి వచ్చి దేశానికి సేవ చేయాలని అభ్యర్థించారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు నచ్చిన రంగంలో రాణించేలా స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
భగవంత్‌మాన్ వ్యాఖ్యలపై పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ రియాక్టయ్యారు. విదేశీయులను రాష్ట్రానికి ఆహ్వానించడానికి ముందు `మన ఇంటిని చక్కదిద్దుకోవాలి` అని సూచించారు. `విదేశీయులు ఉద్యోగాల కోసం పంజాబ్‌కు రావచ్చు. కానీ ముందు మన ఇంటి (రాష్ట్రాన్ని)ని చక్కదిద్దుకోవాలి. యువతకు ఉపాధి అవకాశాలపై హామీలు కల్పించాలి. శాంతిభద్రతలను పరిరక్షించాలి. అవినీతికి చరమగీతం పాడాలి. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను, కార్మికుల రక్షించాలని పేర్కొన్నారు. "విదేశీయులు ఉద్యోగాల కోసం పంజాబ్ ఆశ్రయిస్తారనేది నిజం కావాలని ఆశిస్తున్ననని తెలిపారు.
