హిజాబ్ వివాదం గురించి ఇతర దేశాలు, విదేశీ సంస్థలు వ్యాఖ్యానించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హిజాబ్ వివాదం భారత్ అంతర్గత విషయం అని, దీనిపై బయటి వారు కామెంట్ చేయడానికి వీల్లేదని, వారికి ఆ హక్కు లేదని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: కర్ణాటక(Karnataka) పాఠశాలల్లో మొదలైన హిజాబ్ వివాదం(Hijab Row) క్రమంగా దేశవ్యాప్త చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం రాష్ట్రవ్యాప్తంగా రాజుకుంటున్న క్రమంలో ప్రభుత్వ వెంటనే స్కూల్స్, కాలేజీలకు తాత్కాలిక సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన దాఖలు కావడంతో ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటున్నది. అయితే, ఈ వివాదంపై చర్చ కేవలం మన దేశానికే పరిమితం కావడం లేదు. కొన్ని విదేశీ సంస్థలూ, దేశాలూ ఈ వివాదంపై వ్యాఖ్యలు చేస్తుండటాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఇది అంతర్గత వ్యవహారమని(Internal Issue), బయటి వారికి ఈ వివాదం(Controversy)పై కామెంట్ చేసే హక్కు లేదని స్పష్టం చేసింది.
హిజాబ్ వివాదం విదేశీ వ్యవహరాల అంశం కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఇది దేశంలోని ఒక అంతర్గత విషయం అని వివరించారు. కాబట్టి, దీనిపై బయటి వారు ఎవరైనా.. లేదా వేరే దేశమైనా కామెంట్ చేయరాదని స్పష్టం చేశారు. భారత్‌కు ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నదని, న్యాయవ్యవస్థ ఉన్నదని, ప్రజాస్వామిక సంప్రదాయాలు ఉన్నాయని అన్నారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లోనే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించుకుంటామని తెలిపారు. అదీగాక, ఈ అంశం ఇప్పుడు న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నదని చెప్పారు. హిజాబ్ వివాదాన్ని కర్ణాటక హైకోర్టు విచారిస్తున్నదని అన్నారు. భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు సంబంధించిన అంతర్గత విషయాలపై బయటి వారికి కామెంట్ చేసే హక్కు లేదని స్పష్టం చేశారు.
అమెరికా, ముస్లిం దేశాలతో కూడిన ఓ సంస్థ ఓఐసీలు హిజాబ్ వివాదంపై కామెంట్ చేశాయి. ఈ కామెంట్లను భారత ప్రభుత్వం ఖండించిన తర్వాతే విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. విదేశాంగ వ్యవహారాల శాఖ కొంత లోతుగా వెళ్లి ఓఐసీని దాదాపుగా నేరుగా విమర్శించింది. ఓఐసీ సెక్రటేరియట్‌కు ఉన్న మతోన్మాద మైండ్‌సెట్ వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు దానికి కనిపించవని పేర్కొంది. ఆ సంస్థ ఎప్పుడూ దాని కుట్రపూరిత ప్రయోజనాల కోసమే వ్యాఖ్యలు చేస్తుంటుందని వివరించింది. అందుకే భారత్‌కు వ్యతిరేకంగా ఆ సంస్థ పలుమార్లు వ్యాఖ్యలు చేసిందని తెలిపింది. తద్వారా ఈ సంస్థ దాని రిప్యుటేషన్‌ను స్వయంగా నష్టపరుచుకుంటున్నదని వివరించింది.
నిన్న హైకోర్టులో జరిగిన విచారణలో అడ్వకేట్ రవి వర్మ కుమార్ పిటిషనర్ల తరఫు వాదిస్తూ.. వేలాది మతాల గుర్తులను, సంకేతాలను, వారి మతాలను వ్యక్తపరిచే వాటినీ ధరించి రావడానికి అనుమతిస్తుండగా కేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.దుపట్టాలు, గాజులు, టర్బన్‌లు, శిలువలను, బొట్టులను ధరించే వారిని ఎందుకు ప్రతి రోజు అనుమతిస్తున్నారని అడ్వకేట్ రవి వర్మ కుమార్ వాదించారు. మన విశాల సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మతపరమైన సంకేతాలను మాత్రమే చర్చిస్తున్నారని తెలిపారు. అందులో కేవలం ఒక్క హిజాబ్‌ను మాత్రమే ఎందుకు వద్దు అంటున్నారని అడిగారు. హిజాబ్ ఒక్క దాన్నే వద్దనడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. గాజులు వేసుకుంటున్నారని, అది మతపరమైన సింబల్ కాదా? అని అడిగారు. మీరు ఎందుకు కేవలం ముస్లిం అమ్మాయిలనే ఎంచుకున్నారని అడిగారు.
