ఓ విదేశీ పర్యాటకురాలిపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా బయటకు వచ్చిన మహిళను రోడ్డు పక్కకు ఈడ్చుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటికే ఇండియాలో మహిళలకు రక్షణ లేదని పేర్కొంటున్న ప్రపంచ దేశాల ముందు మరోసారి తలదించుకునేలా జరిగిన ఈ దారుణ సంఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో చోటుచేసుకుంది.   

బ్రిటన్ కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు తరచూ భారత దేశాన్ని సందర్శిస్తుంటుంది. ముఖ్యంగా ఈమె గోవాలోనే ఎక్కువగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె గోవాలోని కనకొనా ప్రాంతంలోని ఓ హోటల్లో దిగారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో పలొలెమ్ బీచ్‌కు వెళ్లడానికి ఒంటరిగా హోటల్ నుండి బయలుదేరింది.

అయితే ఆమె ఒంటరితనాన్ని ఆదునుగా తీసుకుని కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను బలవంతంగా రోడ్డు పక్కకు లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన గల బహిరంగ ప్రదేశంలోనే తుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్దగల డబ్బులు,  విలువైన వస్తువులు దోచుకుని వెళ్లిపోయారు.

తనపై జరిగిన అత్యాచారంపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. విదేశీ పర్యాటకురాలిపై జరిగిన లైంగిక దాడిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.