న్యూఢిల్లీ:  మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయని సమాచారం ఉందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు. ఈ దాడులను నివారించేందుకే ఇవాళ తెల్లవారుజామున బాలాకోట్ కేంద్రంగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడికి దిగినట్టుగా ఆయన తెలిపారు.

మంగళవారం నాడు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే మీడియాతో మాట్లాడారు. పీవోకేలో వందలాది ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు. కచ్చితమైన సమాచారంతోనే దాడికి దిగినట్టుగా ఆయన ప్రకటించారు.

పూల్వామా దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని  పాక్‌ను కోరినా కూడ ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో వైమానిక దాడులకు దిగామని చెప్పారు.

భారత వైమానిక దాడుల్లో  పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.పీఓకేలో వందలాది ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

డ్రోన్ కెమెరాల సహాయంతో ఈ దాడులకు దిగినట్టుగా ఆయన చెప్పారు.ఎన్నిసార్లు చెప్పినా కూడ పాకిస్తాన్‌ వైఖరిలో మార్పు రాలేదన్నారు. 2004లో పాక్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఈ దాడులు సామాన్య ప్రజలకు దూరంగా సాగాయన్నారు.

మసూద్ అజార్  బావ మరిది యూసుఫ్ అజహర్ లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు నిర్వహించినట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.పూల్వామాపై దాడికి  ప్రతీకారం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద దాడులు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. భారత వైమానిక దాడితో జైషే మహ్మద్‌కు కోలుకోలేని దెబ్బ తగిలిందని విజయ్ గోఖలే ప్రకటించారు.