విదేశాంగ కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన వచ్చే నెలాఖరుతో పదవీ కాలం ముగియనుంది. ఆయన పదవీ కాలాన్ని మరో 14 నెలలపాటు అంటే 2024 ఏప్రిల్ 30వ తదీ వరకు పొడిగించింది. 

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 14 నెలలపాటు పొడిగించింది. వినయ్ మోహన్ క్వాత్రా 2022 డిసెంబర్ 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నది. కానీ, ఈ రిటైర్‌మెంట్‌ను 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విదేశాంగ శాఖ సెక్రెటరీ వినయ్ మోహన్ క్వాత్రా పదవీ కాలాన్ని 2022 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించడానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అపాయింట్‌మెంట్స్ కమిటీ క్యాబినెట్ సెక్రెటేరియట్ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే.. ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వం టర్మ్ ముగిసే వరకు ఆయనే ఫారీన్ సెక్రెటరీగా కొనసాగుతారు.

ఇలాంటి పొడిగింపులు కేంద్ర ప్రభుత్వం గతంలోనూ చేసింది. క్యాబినెట్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌ల పదవీ కాలాను గతంలో కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.