మణిపూర్ భద్రతా దళాలపై దాడి వెనుక విదేశీ కిరాయి దళాల హస్తం - ఎన్ బీరెన్ సింగ్
మణిపూర్ లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అయితే ఈ దాడిలో విదేశీ కిరాయి సైనికుల ప్రమేయం ఉందేమో అని మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ అన్నారు.
మణిపూర్ లో ఇటీవల భద్రతా దళాలపై జరిగిన దాడిలో విదేశీ కిరాయిసైనికుల ప్రమేయం ఉందని ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. సరిహద్దు పట్టణం మోరేలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడిన నేపథ్యంలో ఎన్ బీరెన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంఫాల్ లో చికిత్స పొందుతున్న సైనికులను ఆయన మణిపూర్ సీఎం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు అవసరమైన, సాధ్యమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ‘‘ ఉగ్రవాదుల కోసం గాలింపు, కూంబింగ్ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతోంది. ఈ దాడిలో మయన్మార్ వైపు నుంచి విదేశీ కిరాయి సైనికుల ప్రమేయం ఉందని మేము అనుమానిస్తున్నాం.’’ అని అన్నారు.
మణిపూర్ ను అస్థిరపరిచే వారిని ఎదుర్కోవడానికి, బాధ్యులపై నిర్ణయాత్మక చర్యలతో బాధితులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. కాగా.. భద్రతా దళాల సిబ్బంది అంతా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారని, ఇంఫాల్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలో నలుగురు వ్యక్తులను కాల్చిచంపిన నేపథ్యంలో భద్రతా దళాలపై కొత్త ఏడాదిలో ఈ దాడులు జరిగాయి. రాష్ట్రంలో తాజా హింస తీవ్రతరం కావడంతో తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ సడలింపు ఉత్తర్వులను తక్షణమే రద్దు చేస్తున్నామని, తౌబాల్ జిల్లా మొత్తం రెవెన్యూ పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నామని జిల్లా మేజిస్ట్రేట్ ఎ.సుభాష్ ఉత్తర్వులు జారీ చేశారు.