ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో ప్రమాదం జరిగింది. స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించగా, 29 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది స్టేషన్‌లోని 1 నెంబర్ ఫ్లాట్ ఫాం ఉత్తర భాగంతో బీటీ లైనును కలుపుతుంది.

రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. నిజానికి ఈ ఓవర్ బ్రిడ్జి మరమ్మతులో ఉంది. అయినప్పటికీ దాన్ని వాడుతున్నారు. ప్రమాదం సాయంత్రం 7.30 గంటలకు రద్దీగా ఉండే సమయంలో జరిగింది.

గాయపడినవారిని సమీపంలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చేర్పించారు. మరికొంత మందిని జిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన మహిళలను ఆపూర్వ ప్రభు (35), రంజన టాంబే (40), సారిక కులకర్ణి (35)లుగా గుర్తించారు. 

మృతి చెందిన పురుషులను జహీద్ సిరాజ్ ఖాన్ (32), తాపేంద్ర సింగ్ (35)లుగు గుర్తించారు. ప్రభు, తాంబే జీటీ ఆస్పత్రి సిబ్బంది. శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ వెలికి తీశారు. 

బాధితులకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతాపం ప్రకటించారు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు