చెన్నైలోని ఓ బిర్యానీ ఔట్‌లెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 70 కిలోల మాంసాన్ని, 30 కిలోల వండిన బిర్యానీని వారు సీజ్ చేశారు. మాంసం ఎక్స్‌పైర్ అయిందని అధికారులు చెప్పారు. రిఫ్రిజిరేటర్‌లోనూ మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచలేదని పేర్కొన్నారు.

చెన్నై: బిర్యానీ షాపుల్లో తనిఖీలు కొన్ని సార్లు దారుణమైన విషయాలను వెలికి తీశాయి. మాంసంలో అవకతవకలు.. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ఇతర జంతువుల మాంసాన్ని బిర్యానీకి ఉపయోగించడం వంటి విస్మయకర విషయాలు బహిర్గతం అయ్యాయి. తాజాగా, చెన్నైలో ఓ బిర్యానీ ఔట్‌లెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. వెంటనే వారు ఆ షాపు వెలుపుల స్టాప్ సేల్ అనే నోటీసు పెట్టారు.

చెన్నైలో వడపలనిలోని యా మొహియుదీన్ బిర్యానీ ఔట్‌లెట్‌లో జూన్ 2వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 70 కిలోల మాంసాన్ని సీజ్ చేశారు. అలాగే, 30 కిలోల వండిన బిర్యానీని కూడా సీజ్ చేసినట్టు ఇండియా టుడే కథనం వెల్లడించింది.

సీజ్ చేసిన 70 కిలోల మాంసం ఎక్స్‌పైర్ అయిందని అధికారులు తెలిపారు. ఈ మాంసాన్ని షాప్ నిర్వాహకులు రిఫ్రిజిరేటర్‌లో పెట్టారని పేర్కొన్నారు. అయితే, సరైన టెంపరేచర్ల దగ్గర మాంసాన్ని నిల్వ చేయలేదని అధికారులు కనుగొన్నారు.

దీంతో అధికారులు ఆ షాప్‌కు రూ. 5000 జరిమానా విధించారు. అంతేకాదు, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ కు చెందిన కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని షాపు యజమానులను ఆదేశించారు. అంతేకాదు, కిచెన్, ఫ్రీజర్‌లనూ నవీకరించాలని సూచించారు.

అంతేకాదు, సీజ్ చేసిన మాంసాన్ని, బిర్యానీని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పంపారు. అక్కడ వీటిని పరిశీలించనున్నారు. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఆ ఫుడ్ ఔట్‌లెట్‌పై ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద అభియోగాలు దాఖలు చేస్తారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ నెలలో సౌదీ అరేబియా ప్రభుత్వం సమోసాలు అమ్మే ఓ రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఆ రెస్టారెంట్‌పై అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు గత 30 ఏళ్లుగా సమోసాలు, ఇతర స్నాక్స్ వాష్‌రూమ్‌లో తయారు చేసినట్టు తెలిసింది. మరెన్నో నిబంధనలు ఉల్లంఘించినట్టు వెల్లడైంది. ఆ వెంటనే అధికారులు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. సౌదీ అరేబియా నగరం జెడ్డాలో ఈ రెస్టారెంట్ ఉన్నది.

సుమారు 30 ఏళ్లుగా జెడ్డాలో సమోసా రెస్టారెంట్ నడుస్తున్నది. చాలా మంది అక్కడ తిని వెళ్లుతుంటారు. అయితే, ఆ రెస్టారెంట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్ వాష్ రూమ్‌లోనే తయారు చేస్తున్నట్టు స్థానికులు కొందరు మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ రెస్టారెంట్‌పై అనూహ్య తనిఖీలు చేశారు.

ఆ రెస్టారెంట్‌లో సమోసాలు, స్నాక్స్, ఇతర మీల్స్ అన్నీ వాష్‌రూమ్‌లోనే తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఆ రెస్టటారెంట్‌లో కాలం చెల్లిన వస్తువులూ లభించాయని తెలిసింది. మాంసం, చీజ్ వంటి ఉత్పత్తులు ఎక్స్‌పైర్ అయిపోయాయని అధికారులు గుర్తించారు. అవన్నీ కనీసం రెండేళ్ల క్రితం నాటివని పేర్కొన్నారు. అంతేకాదు, అక్కడే కొన్ని పురుగులు, ఎలుకలనూ గుర్తించారు. ఆ రెస్టారెంట్‌లో పని చేస్తున్న వర్కర్లకు హెల్త్ కార్డులు లేవని అధికారులు వివరించారు. రెసిడెన్సీ చట్టాన్నీ వారు స్పష్టంగా
ఉల్లంఘించారని తెలిపారు. అందుకే ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసేశారు.