కర్ణాటక లో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్థల కారణంగా ప్రియురాలిని ప్రియుడు అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులోని  మసంద్రపాళ్యలో ఆదివారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  సామసంద్రపాళ్యకు చెందిన సహానా (17), బెంగళూరులో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసే రాజు (25)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

కాగా ఈ మధ్యకాలంలో వీరిద్ధరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాజు సహానాను సామసంద్రపాళ్యలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ కూడా ప్రేమ విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

గొడవ అంతకంతకూ పెరుగుతుండడంతో సహనం కోల్పోయిన రాజు సహానాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం మల్లేశ్వరం నుంచి యశ్వంతపుర వైపు వెళ్లే రైలెక్కాడు. 

వేగంగా వెల్తున్న రైలు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తోటి ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని తక్షణమే నిమ్హాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

రాజు విషయం తెలుసుకున్న సహానా తల్లిదండ్రులు అనుమానంతో అతని ఇంటికి వెళ్లి చూడగా.. సహానా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన పోలీసులు మృతదేమాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రాజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.