దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో వుంచుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది.  

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) (rashtriya janata dal) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు (lalu prasad yadav) ఊరట లభించింది. డొరండ ట్రెజరీ కేసులో (doranda treasury case) ఆయనకు శుక్రవారం బెయిలు మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జార్ఖండ్ హైకోర్టు (jharkhand high court) ఆయనకు బెయిలు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధించింది. 

తీర్పు అనంతరం లాలూ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేసిందన్నారు. సగం శిక్షా కాలం జైలులో గడపటం, ఆరోగ్య సమస్యలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఉపశమనం ఇచ్చిందని వెల్లడించారు. రూ.1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని, రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించినట్లు తెలిపారు. 

ఈ కుంభకోణం జరిగిన సమయంలో లాలూ బిహార్ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పశుసంవర్ధక శాఖ ఇచ్చిన బూటకపు చలానాలు, బిల్లులను ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లియర్ చేసిందని, ఆ సొమ్మును ట్రజరీ ద్వారా విడుదల చేశారని కేసు నమోదైంది. డొరండ ట్రెజరీ నుంచి 1995-96లో రూ.139.35 కోట్లు అక్రమంగా విడుదలైనట్లు ఆరోపణలు వచ్చాయి. 

దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉంచారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా చేరారు.