గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్ లోని షిప్రా నది పొంగిపొర్లుతోంది. దీంతో ఉజ్జయిని జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు నీట మునిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు షిప్రా నదికి వరదలు వచ్చాయి. ఆ నది పొంగిపొర్లుతుండటంతో రామ్ ఘాట్ సమీపంలో ఉన్న పలు ఆలయాలు నీట మునిగాయి. సోషల్ మీడియాలో విడుదలైన పలు వీడియోల్లో ఆ ఆలయాల గోపురాల వరకు నీరు వచ్చినట్టు కనిపిస్తోంది.

Scroll to load tweet…

ఈ వరదల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. జిల్లాలో నీట మునిగిన ప్రదేశాలకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది. రాంఘాట్ సమీపంలోని ఆలయాలన్నీ నీట మునిగాయని షిప్రా తైరక్ దళ్ కార్యదర్శి సంతోష్ సోలంకి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపారు.  ప్రమాదాలు జరగకుండా ఘాట్ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Scroll to load tweet…

స్థానికంగా  ఉన్న పెద్ద బ్రిడ్జి వరకు నీరు చేరింది. ఈ వరదల వల్ల ఎక్కడికక్కడ అధికార, పోలీసు శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్లు అప్రమత్తమయ్యాయి. నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించడంతో పాటు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. కాగా.. జిల్లాలోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక తహసీల్దార్ అనిరుద్ మిశ్రా తెలిపారు. మున్ముందు కూడా ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంమని చెప్పారు.