Guwahati: అసోంను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా అసోంలోని తముల్‌పూర్ జిల్లాలో కలనది నదిపై ఉన్న వంతెనలో ఎక్కువ భాగం సోమవారం కుప్పకూలింది. ఈ వంతెన తముల్పూర్ జిల్లాలోని కుమారికత-జలహ్ ప్రాంతాన్ని కలిపింది. 

Assam Floods: అసోంను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. వరదల పరిస్థితి సోమవారం భయానకంగా మారిందనీ, వరదల కారణంగా 1.90 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారనీ, ఒకరు మరణించారని అధికారిక బులెటిన్ లో పేర్కొంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా నదుల నీటి మట్టాలు పెరిగాయనీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపింది. నీటి మట్టాలు పెరగడంతో గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై, జోర్హాట్ లోని నేమాటిఘాట్ వద్ద ఫెర్రీ సేవలను నిలిపివేశారు.

శివసాగర్ జిల్లాలోని డెమోవ్ లో ఒకరు మృతి చెందారనీ, దీంతో ఈ ఏడాది వరదల్లో మృతుల సంఖ్య 15కు చేరిందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. ప్రస్తుతం 17 జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయనీ, 1,90,675 మందిపై ప్రభావం పడిందని తెలిపింది. లఖింపూర్ జిల్లాలో అత్యధికంగా 47,338 మంది, ధేమాజీ జిల్లాలో 40,997 మంది ప్రభావితమయ్యారు. ప్ర‌స్తుతం 427 మంది రెండు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతుండగా, 45 సహాయ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వివిధ ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నాయని ఏఎస్డీఎంఏ తెలిపింది.

ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న ప్రధాన నదుల్లో దిబ్రూగఢ్ లోని బ్రహ్మపుత్ర, ధుబ్రీ, తేజ్ పూర్, జోర్హాట్ లోని నేమాటిఘాట్ ఉన్నాయి. బెకి, జియా-భరాలీ, దిసాంగ్, దిఖౌ, సుబన్సిరి నదులు కూడా రెడ్ మార్క్ ను అధిగమించాయని ఏఎస్డీఎంఏ బులెటిన్ లో పేర్కొంది. బ్రహ్మపుత్రలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గౌహతిలో ఫెర్రీ సేవలను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ నదుల నీటిమట్టం పెరగడంతో నెమటిఘాట్- మజులి మధ్య ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు.

ప్రస్తుతం 8,086.40 హెక్టార్ల పంట భూములు వరదనీటిలో ఉన్నాయనీ, 81,340 పెద్ద జంతువులు, 11,886 కోళ్లతో సహా 1,30,514 జంతువులు ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. ఉదల్‌గురిలోని రెండు ప్రాంతాలు, బిశ్వనాథ్, దర్రాంగ్ లో ఒక్కొక్కటి చొప్పున వరదనీటితో కరకట్టలు తెగిపోయాయని తెలిపింది. వరదల్లో రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. బార్‌పేట, బిస్వనాథ్, ధుబ్రి, లఖింపూర్, మోరిగావ్, నల్బరి, శివసాగర్, సోనిత్‌పూర్, టిన్‌సుకియా, ఉడల్‌గురిలలో కోతలు నమోదైనట్లు ASDMA బులెటిన్ తెలిపింది.