కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27న అంతర్జాతీయ విమాన సేవలు పున:ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే అవి ఫుల్ కెపాసిటీతో నడుస్తాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. త్వరలోనే కరోనా పూర్వ స్థితికి ప్రయాణికుల సంఖ్య చేరుతుందని ఆశించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్నే పేర్కొంటూ మరో విషయాన్ని తెలిపారు. ఈ మార్చి 27వ తేదీ నుంచి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫుల్ కెపాసిటీతో నడుస్తాయని వెల్లడించారు. పార్లమెంటులో బడ్జెట్ సెకండ్ సెషన్ పార్లమెంటులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సెషన్ కొశ్చన్ అవర్‌లో ఎగువ సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర మంత్రి సింధియా ఈ విషయాన్ని తెలిపారు. గతేడాది అక్టోబర్ 18వ తేదీ నుంచి దేశీయ విమానాలు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా కాలంలో విమానయాన సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు మళ్లీ కరోనా పూర్వ పరిస్థితులు మెల్లగా నెలకొంటున్నాయని వివరించారు. 

కరోనా మహమ్మారి మన దేశంలోకి రావడానికి ముందు ఒక రోజు సుమారు నాలుగు లక్షల మంది ప్యాసింజర్లు విమానాల్లో ప్రయాణించేవారని వివరించారు. కానీ, కరోనా తర్వాత అంతర్జాతీయ, దేశీయ విమానయానాలనూ నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలుత దేశీయ విమానయానాన్ని పునరుద్ధరించారు. కాగా, ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ విమానయానం రీస్టార్ట్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో ఒక రోజులో విమాన ప్రయాణికుల సంఖ్య 3.83 లక్షలుగా ఉన్నదని, ఈ విషయం వెల్లడించడానికి సంతోషంగా ఉన్నదని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే విమానయాన ప్రయాణికుల సంఖ్య కరోనా పూర్వస్థితికి త్వరలోనే చేరుతుందని తెలిపారు. అలాగే, విమానయాన రంగంలోనూ ఎంప్లాయిమెంట్ లెవెల్స్ అదే స్థాయికి చేరుతాయని ఆశించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ విమాన సేవలను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విమాన సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ విస్తృతంగా జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ సర్వీస్‌లను రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంటే ఈ ఏడాది సమ్మర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని వివరించింది. ఈ అంత సేవలు కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్‌లైన్స్‌కు లోబడే జరుగుతాయని తెలిపింది.

అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్‌ (Scheduled Flights)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం గతనెల 28వ తేదీన పొడిగించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు అంతర్జాతీయ విమానాల (International Flights)పై నిషేధం (Ban) అమల్లోనే ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అప్పుడు స్పష్టం చేసింది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలకు, ప్రత్యేకంగా అనుమతులు పొందిన ఫ్లైట్స్‌కు వర్తించవని వివరించింది.