జోక్ వల్ల విమానం 16 గంటల పాటు ఆలస్యమైన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానం సోమవారం తెల్లవారుజామున 1.20 గంటలకు టేకాఫ్‌కు రెడీ గా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు తన సీట్ నుంచి లేచి తన బ్యాగులో గన్ ఉందంటూ సిబ్బందికి చెప్పాడు.

దీంతో కంగారుపడిన విమాన సిబ్బంది అతనిని ఫ్లైట్‌లోంచి దించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అతనిని కొన్ని గంటల పాటు పోలీసులు విచారించి.. వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నోటి నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో అతడి లగేజిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

బ్యాగులో వస్తువులు, గిటార్ తప్పించి ఎటువంటి ఆయుధాలు లేవు. అయితే ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు విమానం టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేదంటూ డిమాండ్ చేశారు.

ఈ లోగా అతడు చెప్పింది అబద్ధమని నిర్ధారించిన పోలీసులు సాయంత్రం 5.23 గంటలకు విమానం టేకాఫ్‌కు అనుమతిచ్చారు. తన దగ్గర ఉన్న గిటార్‌ను గన్‌గా చెప్పి జోక్ చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మొత్తం తతంగం కారణంగా విమానం సుమారు 16 గంటల పాటు రన్‌వేపై నిలిచిపోయింది.