న్యూఢిల్లీ:కరోనా రోగులకు అంబులెన్స్ సమకూర్చడానికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ రోగులకు అంబులెన్స్ ను అందించేందుకు గాను ఛార్జీలను  నిర్ణయించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

జస్టిస్ ఆశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దేశంలోని కరోనా రోగులకు సరైన సేవ ఉండేలా అంబులెన్స్ లను పెంచేందుకు తగిన ఉత్తర్వులు లేదా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం నాడు విచారించింది.

కరోనా విషయంలో కేంద్రం సలహాతో రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సంఖ్యలో అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ప్రతి జిల్లాలో కరోనా సోకిన రోగులకు సేవలు అందించేందుకు అంబులెన్స్ లను సిద్దంగా ఉంచాలని కూడ సుప్రీంకోర్టు కోరింది.కరోనా సోకిన రోగులను తరలించే అంబులెన్స్  యజమానులు  పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్లు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అంబులెన్స్ సేవలకు గాను ఫీజులను నిర్ధేశించాలని ఆయా రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది.