హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణం తీసుకున్న సుఖ్విందర్ సింగ్ సుఖు అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. తండ్రి బస్ డ్రైవర్. ఆయన గతంలో పాలు కూడా అమ్మేవారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ యూత్ వింగ్‌లో చేరి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.  

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. బీజేపీని గద్దె దింపిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం రేసులో చాలా మంది ఉండటంతో ఎంపికైన నేతపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుఖ్విందర్ సింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

సుఖ్విందర్ సింగ్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి బస్ డ్రైవర్. ఛోటా షిమ్లాలో సుఖ్విందర్ సింగ్ సుఖు తొలినాళ్లలో పాలు కూడా అమ్మాడు. ఓ మిల్క్ కౌంటర్‌ను ఆయన నడిపారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్‌లో చేరడంతో మొదలైందని చెప్పవచ్చు.

లా గ్రాడ్యుయేట్ అయిన సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో తన పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. కాంగ్రెస్ యూత్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ తర్వాత క్రమంగా పదవులు చేపట్టారు.

Also Read: హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక..

హిమాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా సుఖ్విందర్ సింగ్ సుఖు సుమారు దశాబ్దకాలం బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం, ఆయన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా రికార్డుస్థాయిలో ఆరు సంవత్సరాలు కొనసాగారు. 2013 నుంచి 2019 వరకు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తొలిసారి 2003లో నదౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లోనూ మళ్లీ గెలిచి తన సీటును కాపాడుకున్నారు. కానీ, 2012లో పరాజయం పాలయ్యారు. కానీ, మళ్లీ 2017లో నెగ్గారు. ఈ సారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు చీఫ్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ సింగ్ సుఖు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరుచూ ఆరు సార్లు సీఎంగా చేసిన దివంగత నేత వీరభద్ర సింగ్‌తో విబేధించేవారు.

సుఖ్విందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ దిగువ భాగం నుంచి సీఎంగా ఎన్నికైన తొలి నేత సుఖ్విందర్ సింగ్ సుఖు కావడం గమనార్హం.