కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కొప్పల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు జెండాను ఏర్పాటు చేశారు.

వేడుకలు ముగియడంతో కొందరు విద్యార్ధులు ఆదివారం జెండా స్థంభాన్ని తొలగిస్తుండగా అది.. విద్యుత్ తీగలను తాకింది. దీంతో స్తంభాన్ని పట్టుకున్న విద్యార్ధులు కరెంట్‌ షాక్‌కు గురై ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. స్కూలు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు ఆందోళనకు దిగారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.