ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కొన్ని పార్టీలు డీలా పడిపోయాయి. ఇప్పటికే.. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే విషయంలో అవగాహన వచ్చింది. 

మధ్యాహ్నం 12గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ 209, స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్ష కూటమి కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

ఇక తమిళనాడులో ఏడీఎంకే 97, డీఎంకే 136 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రభావం చూపిస్తుందుకున్న కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కేరళ విషయానికి వస్తే.. ఎల్డీఎఫ్ 89, యూడీఎఫ్ 44, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

అస్సాంలో బీజేపీ 79, కాంగ్రెస్ 45, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. పుదుచ్చేరిలో బీజేపీ 12, కాంగ్రెస్ 3 , ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

ఇదిలా ఉండగా,.. ఇటీవల ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మార్చ్ 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6వ తేదీల్లో జరిగిన ఎన్నికల్లో సరాసరిన 82 శాతం వోటింగ్ నమోదయింది. అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ నెంబర్ 64 సీట్లు. 
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అసోం గణ పరిషద్, యుపిపిఎల్ లతో పొత్తు కుదుర్చుకుంది. మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పది పార్టీలతో మహాజూత్ ను ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. ప్రధానంగా పోటీ ఈ రెండు కూటముల మధ్యనే ఉన్నప్పటికీ... యునైటెడ్ రీజినల్ ఫ్రంట్ గా అస్సాం జాతీయ పరిషద్, రైజోర్ దళ్ కలిసి పోటీచేస్తున్నాయి. 
2001 నుంచి వరుసగా విజయం సాధిస్తున్న కాంగ్రెస్ ను 2016లో గద్దె దింపి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుని సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఇక్కడ మరో దఫా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ప్రకటించాయి.

ఇక కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 

కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక నిత్యకృత్యంగా తయారయింది. దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎల్ డి ఎఫ్ రంగంలోకి దిగింది. 
దేశవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ కి ఈ రాష్ట్రం గెలవడం అత్యవసరం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మొత్తం కాంగ్రెస్ క్యాడర్ లో ఒక జోష్ తీసుకురావొచ్చని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ విజయాన్ని సాధించడాం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఒక ఆమోదముద్ర పడుతుందని అనుకున్నాయి కాంగ్రస్ వర్గాలు. . 
ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ సాధ్యమైనంత మేర వాడుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశం కలిసివస్తదని భావించినప్పటికీ... అది అంతలా కలిసిరాలేదు.