Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Crisis: సీఎంగా ఏక్‌నాథ్ షిండే ఎందుకు? ఐదు కారణాలివే.. బీజేపీ ప్లాన్ ఫలించేనా?

వారంపాటు సాగిన మహారాష్ట్ర రాజకీయ హైడ్రామా ఈ రోజు ట్విస్టులపై ట్విస్టులతో కీలక మలుపులు తీసుకుంది. రెబల్స్.. బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ఊహించినా.. సీఎంగా ఏక్‌నాథ్, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం తీసుకోవడం ఊహించని పరిణామం. బలం ఎక్కువే ఉన్న బీజేపీ సీఎం సీటును చేతులారా ఏక్‌నాథ్ షిండేకు ఎందుకు అప్పజెప్పింది. ఇందుకు ఐదు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
 

five reasons why bjp opted eknath shinde as CM candidate but not devendra fadnavis.. bjp 2024 election strategy
Author
Mumbai, First Published Jun 30, 2022, 8:12 PM IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాను పైపైన చూసినా.. బాధిత పార్టీగా శివసేననే కనిపిస్తున్నది. పరోక్షంగా మాత్రం బీజేపీ లాభపడుతున్నది. ఇప్పటికి ఇప్పుడే ఆ ఫలితాలు కనిపించకపోయినా.. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఈ రాజకీయ సంక్షోభం ఎంతో లబ్ది చేకూర్చే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం వరకు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తుండటంతో ఇక దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కుర్చీని అధిరోహించడమే లాంఛనమే అనుకున్నారంతా.. కానీ, ఆయన ప్రెస్ మీట్‌లో అందరికీ షాకిస్తూ సీఎంగా ఏక్‌నాథ్ షిండేను ప్రకటించారు. ఈ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేదు. ఉద్ధవ్ ఠాక్రే టీమ్ కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే.. ఉద్ధవ్ స్వయంగా సీఎం పోస్టు గురించి మాట్లాడినప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు అడిగితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాడినని చెప్పారు. అంతేకాదు, వారు బీజేపీతో కలిస్తే మాత్రం డిప్యూటీ సీఎం తప్పితే ఒక శివసైనికుడిని సీఎం కుర్చీపై కూర్చోబెడతారా? అని కూడా ప్రశ్నించారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే అంచనాలనూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన తలకిందులు చేసింది.

ఇప్పుడు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులు ఏక్‌నాథ్ షిండేను ఎందుకు ఎంచుకున్నట్టూ అనే చర్చ మొదలైంది. ఎవరి విశ్లేషణలు వారివి. కానీ, ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్న ఐదు కారణాలను ఇక్కడ చూద్దాం.

1. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన జట్టుగా ఎన్నికల్లో దిగాయి. కానీ, ఫలితాలు వెలువడ్డ తర్వాత సీఎం కుర్చీపై పేచీతో ఇరుపార్టీలు విడిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు ఉదయమే దేవేంద్ర ఫడ్నవీస్.. ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్‌ను వెంట తెచ్చుకుని, ఆయనకు డిప్యూటీ.. తాను సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఎన్సీపీ నుంచి మద్దతు లభించకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా బీజేపీ అధికార దాహంతో ఎంతకైనా తెగిస్తుందనే ఓ అభిప్రాయ అక్కడ వచ్చింది. ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏక్‌నాథ్ షిండేకు ఆ అవకాశం ఇచ్చి 2019లో పడిన మచ్చను కొంతైనా చెరుపుకోవచ్చు. మరొక విషయం.. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఇప్పటికే సగం ముగిసింది. మరో రెండు లేదా.. రెండున్నర సంవత్సరాల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

2. ఉద్ధవ్ ఠాక్రే సీఎం దిగిపోతూ.. బాలాసాహెబ్ కొడుకును మీరు (బీజేపీ) తక్కువ చేశారు అన్నట్టుగా మాట్లాడారు. ఓటర్లను దృష్టిలో పెట్టుకుంటు ఆయన స్పీచ్.. భావోద్వేగంగా, రాజకీయంగా లబ్ది చేకూరుస్తుంది. ఈ సమస్యను ఒక శివసైనికుడిని సీఎంగా కూర్చోబెట్టి తొలగించుకోవచ్చు.

3. మహారాష్ట్రలో శివసేనకు ఉన్న బలం మామూలిది కాదు. ఇక్కడ మొదట శివసేన బలంతోనే బీజేపీ ఎదిగింది. ఏక్‌నాథ్ షిండేను సీఎం చేసి.. తాము ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ లెగసీకి మద్దతు ఇస్తున్నామని బీజేపీ చెప్పుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ స్పీచ్‌లోనూ ఈ విషయాన్ని పలుమార్లు ఒత్తిపలికారు.

4. మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాతో నిజమైన శివసేన ఏది? అనే ప్రశ్న ఉదయించింది. దీనికి సరైన సమాధానం ఇప్పుడే లభించకున్నా.. తాము బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడుస్తున్నామని తరుచూ చెప్పుకుంటున్న ఏక్‌నాథ్ షిండేను 2024 ఎన్నికల్లో నిజమైన శివసైనికుడని, ఆయన వర్గాన్ని నిజమైన శివసేనగా బీజేపీ ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వార ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ చెక్ పెట్టొచ్చు.

5. ఏక్‌నాథ్ షిండేకు ఎక్కువ సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉండొచ్చు. కానీ, ఆ తిరుగుబాటుదారులే మరో సారి తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏంటి? అదీ బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఉంటే ఎక్కువ ముప్పు ఉంటుంది. కాబట్టి వారి సొంత పార్టీనే అధికారంలో ఇవ్వడం మంచి నిర్ణయం అని బీజేపీ భావించి ఉండొచ్చు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఈ నిర్ణయాలతో ప్రస్తుత రెబల్ శివసేన, బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగవచ్చు. బీజేపీ జూనియర్ పార్ట్‌నర్‌గానైనా అధికారంలో ఉంటుంది. కానీ, శివసేన పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉన్నది. అంత త్వరగా దానికి పరిష్కారం లభించకపోవచ్చు. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. బలహీనంగా ఉన్న శివసేనను సులువుగా ఎదుర్కోవచ్చు. మరిన్ని సీట్లు ఎక్కువ రాబట్టి సొంతంగా అధికారంలోకి రావచ్చు. ఈ ప్లాన్ ఫలిస్తుందా? లేదా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios