అసోంపై ఉల్ఫా తీవ్రవాదులు పంజా విసిరారు.. తిన్సుకియా జిల్లా కేర్బారీ గ్రామంలో సాయుధులైన మిలిటెంట్లు రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఓ కిరాణా షాపు వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్న కొంతమంది యువకులను అపహరించుకుపోయారు.

అనంతరం వారిని బ్రహ్మపుత్రా నదీ తీర ప్రాంతంలోని దోలా-సాదియా వంతెన వద్దకు చేతులను తాళ్లతో వెనక్కికట్టి కాల్చి చంపారు. ఆరుగురు వ్యక్తులు ఆర్మీ యూనిఫాంలో వచ్చి యువకులను ఎత్తుకుపోయారని.. ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

మృతులను సుబాల్ దాస్, శ్యామోల్ బిశ్వాస్, అభినాశ్ బిశ్వాస్, అనంత బిశ్వాస్, ధనుంజయ్ నమసుద్ర ఉన్నారు. వీరంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు యువకులే. రాష్ట్ర రాజధాని గౌహతికి 500 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తీవ్రవాద చర్యపై అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా డీజీపీ, ఇతర అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... ఇది అసోంలో ఎన్ఆర్‌సీ( నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) దుష్పరిణామమే అని పేర్కోన్నారు. ఉల్ఫా ఉగ్రవాదుల కోసం సైన్యం, పోలీసులు అసోం-అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి.

ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ పలు బెంగాలీ సంస్థలు ఇవాళ తిన్సూకియాలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. కాగా, ఐదుగురు యువకులను కాల్చి వేసిన సంఘటనలో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) ఒక ప్రకటనను విడుదల చేయడం గమనార్హం.