Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు మరో షాక్.. ఆజాద్‌కు సంఘీభావంగా మరో ఐదుగురు జమ్ము కశ్మీర్ నేతల రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్‌కు సమర్థనగా మరో ఐదుగురు జమ్ము కశ్మీర్ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

five more congress leaders resigned from party after quitting ghulam nabi azad
Author
First Published Aug 26, 2022, 3:55 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశం పార్టీని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం కలకలం రేపింది. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామాకు సంఘీభావంగా మరో ఐదుగురు జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఘులాంం మొహమ్మద్ సరూరీ, హాజీ అబ్దుల్ రషీద్, మొహమ్మద్ అమిన్ భట్, గుల్జార్ అహ్మద్ వని, చౌదరి అక్రమ్ మొహమ్మద్, సల్మాన్ నిజామిలు ఉమ్మడిగా రాజీనామా చేశారు. వారు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఒకే లేఖ బయటకు వచ్చింది. 

గులాం నబీ ఆజాద్ ఈ రోజు కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన పార్టీ పదవులు అన్నింటితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖ రాశారు. ఇందులో పార్టీతో తన జీవిత ప్రయాణం గురించి, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. ఐదు పేజీల తన రాజీనామా లేఖలో ఎక్కువగా పార్టీపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన పేర్కొన్న లోపాలను కారణంగా చూపి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టల కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. ఆయన చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్పందించారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా దురదృష్టకరం అని వివరించారు. అంతేకాదు విచారకరం అని వివరించారు. అదీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మొత్తం కాంగ్రెస్ అంతా కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజనల నేపథ్యంలో బీజేపీపై పోరాడుతున్న సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం విచారకరం అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios