బిహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహికంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు అప్పులే కారణంగా తెలుస్తున్నది. సమస్తిపూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. 

పాట్నా: బిహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటిలో వారు ఐదుగురూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రోజువారీ జీవితం గడవడమే చాలా కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి అప్పు బాధ ఎక్కువైనట్టు తెలుస్తున్నది. రుణం తీసుకున్న చోట తిరిగి చెల్లించడం కష్టంగా మారినట్టు సమాచారం. ఈ ఆర్థిక సమస్యల కారణంగానే ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాపతి నగర్‌లో మావ్ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11వ వార్డులోని మనోజ్ ఝా అనే 45 ఏళ్ల వ్యక్తి ఆటో రిక్షా నడుపుతూ కష్టంగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి దినదిన గండంగా పరిస్థితులు మారాయి. ఇల్లు గడవడానికి అప్పులూ తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ, వాటిని తిరిగి చెల్లించడం దుస్సహంగా మారింది. ఈ కారణంగా అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి దూషించడం, బెదిరించడం వంటివి చేశారు. వీటన్నంటినీ మనోజ్ ఝా కుటుంబం భరించాల్సి వచ్చింది.

Scroll to load tweet…

కాగా, శనివారం రాత్రి వీరంతా ఉరిపోసుకున్నట్టు తెలుస్తున్నది. ఉదయం ఉరికొయ్యలకు వేలాడుతున్న ఈ కుటుంబాన్ని చూసి స్థానికులు హతాశయులయ్యారు. మనోజ్ ఝాతోపాటు ఆయన తల్లి సీతా దేవి(65), కుమారుడు (10), శివమ్ కుమార్ (7), మనోజ్ ఝా భార్య సుందరమణి దేవి (38)లు ఆత్మహత్య చేసుకున్నారు. ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఆత్మహత్య చేసుకోవడంతో మావ్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ కుటుంబానికి చెందిన కేవలం ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నారు. వారి ఆర్తనాదాలకు అంతే లేకుండా పోయింది.