ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నసీర్‌పూర్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న ఎస్‌యూవీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నసీర్‌పూర్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న ఎస్‌యూవీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) రణ్‌విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎస్‌యూవీలోని ప్రయాణికులు గోరఖ్‌పూర్‌లో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి రాజస్తాన్‌లోని జైపూర్‌కు వెళుతుండగా ఉదయం 9.30 గంటల సమయంలో నాసిర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పక్కన వాహనాన్ని ఆపి కాసేపు ఉపశమనం పొందేందుకు దిగారు.

ఆ సమయంలో అంబేడ్కర్ నగర్‌ వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలోని నలుగురు ప్రయాణికులు, మరో కారులోని ఒకరు మృతి చెందారు. మృతులను ఎస్‌యూవీ వాహనానికి సంబంధించి బాబులాల్ (40), నేమిచంద్ (43), కైలాష్ (38), రాకేష్ (37), కారులో ప్రయాణిస్తున్న 35 ఏళ్ల మిథ్లేష్ గుప్తాగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు’’ అని తెలిపారు. 

ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని రణ్‌విజయ్ సింగ్ తెలిపారు. ఎస్‌యూవీలో ఉన్న ఏడుగురు, మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలు అయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్టుగా చెప్పారు. 

ఇక, ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు సీఎంవో ప్రతినిధి ఒకరు తెలిపారు.