కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమ ాదంలో భారత్ కు చెందిన ఐదుగురు స్టూడెంట్లు చనిపోయారు. వీరు శనివారం ఉదయం హైవే నెంబర్ 401లో ప్యాసింజర్ వ్యాన్‌ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనను భారత హైకమిషనర్ ధృవీకరించారు.

కెనడా (Canada)లోని ఒంటారియో (Ontario)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించారు. ఈ విష‌యాన్ని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా (India's High Commissioner Ajay Bisaria) సోమవారం ధృవీకరించారు. మరో ఇద్దరు గాయపడి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. 

ఒంటారియోలో జ‌రిగిన ప్ర‌మాదంలో మృతి చెందిన వారంద‌రూ భారతదేశానికి చెందిన విద్యార్థులే. ఈ ఘ‌ట‌న‌పై భారత హైక‌మిష‌న‌ర్ అజయ్ బిసారియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘‘ కెనడాలో హృదయ విదారక విషాదం చోటు చేసుకుంది. శనివారం టొరంటో సమీపంలో ఆటో ప్రమాదంలో 5 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి సహాయం చేసేందుకు బాధితుల స్నేహితులను IndiainToronto బృందం సంప్రదించింది. ’’ అని ఆయ‌న ట్వీట్ (tweet)చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన విద్యార్థులను హర్‌ప్రీత్ సింగ్ (Harpreet Singh), జస్పిందర్ సింగ్ (Jaspinder Singh), కరణ్‌పాల్ సింగ్ (Karanpal Singh), మోహిత్ చౌహాన్ (Mohit Chouhan), పవన్ కుమార్‌ (Pawan Kumar)లుగా గుర్తించారు. వారు శనివారం ఉదయం హైవే 401లో ప్యాసింజర్ వ్యాన్‌ (passenger van)లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ వ్యాన్ తెల్లవారుజామున 3:45 గంటలకు ట్రాక్టర్-ట్రైలర్‌ (tractor-trailer)ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు కొనసాగుతోంది.