ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు పిడుగుపాటుకు గురై మరణించారు. మరో నలుగురు తీవ్రంగా కాలిన గాయాలకు లోనయ్యారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు భీకర గాలులు, ఉరుములు మెరుపులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటికితోడు పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. ఈ పిడుగుపాటు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల ఐదుగురు మరణించారు. అంతేకాదు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాగ్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఐదుగురు మరణించారు. ఇందులో హిండియా ఏరియాలో ముగ్గురు, మేజాలో ఒకరు, కొరావన్‌లో మరొకరు పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. హండియా పరిధిలోని తారా గ్రామంలో మంజు దేవి, మున్ని దేవి అనే ఇద్దరు మహిళలు మరణించారు. హండియాలోని కెరాకట్ గ్రామానికి చెందిన ఉమా శంకర్, మేజాలోని కకారహి గ్రామంలోని 27 ఏళ్ల రాహుల్ నిషద్‌లు మరణించారు. కొరావన్‌లోని కుక్రహతా గ్రామంలోని బితోలా అనే 45 ఏళ్ల మహిళ మరణించింది.

వీరితోపాటు నలుగురు పిడుగుపాటు కారణంగా వేడికి మాడిపోయారు. వారు చికిత్స పొందుతున్నారు. 35 ఏళ్ల రామ్ గోపాల్, 12 ఏళ్ల శివమ్ సొంకార్, 40 ఏళ్ల అనార్కలి, పంకజ్ కుమార్ బింద్‌లు కాలిన గాయాలకు చికిత్స తీసుకుంటున్నారు.

ఉత్తరాదిన భారీ వర్షాలు ఉన్నట్టు ఇండియా మెటియోరలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పలు చోట్ల ఈ నెల 23 నుంచి 27 వరకు పిడుగుపాటు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నదని తెలిపింది.