చెన్నై: తమిళనాడు రహదారులు నెత్తురోడుతున్నాయి. గత కొంతకాలంగా ప్రమాదాలు పెద్దఎత్తున జరగుతున్నాయి. ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సైతం వివరణ అడిగిన సంగతి తెలిసిందే. 

వారం రోజుల క్రితం ఏడుగురిని మింగేసిన తమిళనాడు రోడ్లు తాజాగా మరో ఐదుగురుని బలిగొన్నాయి. వివరావల్లోకి వెళ్తే  తిరువణ్ణామలై సమీపంలోని చెంగం వద్ద ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పారిశ్రామిక వేత్త సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

మృతులు బెంగళూరుకు చెందిన కోరమంగళ గ్రానైట్‌ యజమాని శ్రీనాథరెడ్డి, అతని కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. శ్రీనాథరెడ్డితో పాటు భార్య, కుమారుడు, అల్లుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారని నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.