Guwahati: ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్ తయాబున్ నిషా.. క్రీడల్లో సత్తా చాటి అనేక పతకాలు సాధించారు. అంతర్జాతీయంగా ప్రశంసలను పొందారు. కానీ ఆమె మనస్సాక్షి విచారంతో భారంగా ఉందని తాజాగా ఆమె వెల్లడించిన ఆసక్తికర విషయాల ద్వారా తెలిపింది.
Veteran international athlete Tayabun Nisha: ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్ తయాబున్ నిషా.. క్రీడల్లో సత్తా చాటి అనేక పతకాలు సాధించారు. అంతర్జాతీయంగా ప్రశంసలను పొందారు. కానీ మనస్సాక్షి విచారంతో భారంగా ఉందని తాజాగా ఆమె వెల్లడించిన ఆసక్తికర విషయాల ద్వారా తెలిసింది. తయాబున్ నిషా చాలాకాలంగా కోల్పోయిన తన స్కూల్ మేట్ కోసం వెతుకుతోంది. ఎందుకంటే, తన స్నేహితురాలికి సంబంధించిన ఒక వస్తువు విషయంలో ఆమె రుణపడి ఉంది.. అలాగే, ఇదే విషయం గురించి క్షమాపణలు సైతం చెప్పాలనుకుంటోంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమె నీరీక్షణ ఫలించింది. తూర్పు అస్సాంలోని శివసాగర్ లో ఉన్న తన క్లాస్ మేట్ జులేఖాను కలుసుకుంది.. !
ఈ కథ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఆమె పాఠశాల రోజల్లో ప్రారంభమైంది. శివసాగర్ పట్టణంలోని దైలాలీ స్కూల్ తరగతి గదిలో ఆమె క్లాస్ మేట్ జులేఖ బంగారు ఉంగరాన్ని పోగొట్టుకుంది. ప్రతి ఒక్కరూ రెండు రోజులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆ రోజుల్లో పాఠశాల ఆవరణను శుభ్రపరిచే బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు. ఈ బాధ్యతను ఎక్కువగా చుట్టుపక్కల నివసించే లేదా క్రీడల సాధన కోసం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తీసుకునేవారు. తయాబున్ నిషాకు క్రీడల పట్ల ఆసక్తి ఉండటంతో, ఆమె త్వరగా పాఠశాలకు చేరుకుని, పాఠశాలను శుభ్రం చేసేది. అలాంటి ఒక రోజు ఆమె తరగతి గదిని శుభ్రం చేస్తుండగా ఒక మూలన జులేఖ ఉంగరం కనిపించింది.
ఇన్ని రోజుల తర్వాత ఆ ఉంగరాన్ని జులేఖకు తిరిగి ఇస్తే అందరూ ఇప్పుడు తననే దొంగగా చూస్తారని గ్రహించింది. నిషా రైతు కుటుంబానికి చెందినది కాగా, జులేఖ తండ్రి సంపన్నుడైన ప్రభుత్వ ఉద్యోగి. ఉంగరాన్ని తనవద్దే ఉంచుకుంది. "ఆ తర్వాత కొన్ని రోజులకు మా నాన్న చనిపోవడంతో మా ఆర్థిక పరిస్థితి క్షీణించింది. బతుకుదెరువు కోసం గృహోపకరణాలు అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు ఒక రోజు జులేఖ బంగారు ఉంగరాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది" అని తెలిపారు. అయితే, స్పోర్ట్స్ కోటాలో ఎన్ఎఫ్ రైల్వేలో ఉద్యోగం వచ్చిన తర్వాతే మా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడిందని నిషా తెలిపింది.
అయితే, "మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కానీ జులేఖ కోల్పోయిన ఉంగరం విషయం తనను ఎప్పుడూ బాధించేది. ఎలాగైన ఉంగరాన్ని తిరిగి జులేఖకు ఇవ్వాలని అనుకున్నాను. ఇద్దరికి పెండ్లి అయ్యే సమయానికి సంబంధాలు లేకుండా పోయాయి, ఎక్కడ ఉందో తెలియలేదు" అని చెప్పారు. "నేను శివసాగర్ కు వెళ్లినప్పుడల్లా జులేఖ ఆచూకీ కోసం వెతికేదాన్ని. శివసాగర్ లో ఉండే మా చెల్లెలిని జులేఖ కోసం వెతుకుతూ ఉండమని చెప్పాను. శివసాగర్ శివారులోని కుకురపోహియాలో చివరకు ఆమెను నా సోదరి కనుగొంది" అని తెలిపారు. ఆమె గురించి తెలియగానే తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయనీ, వెంటనే ఆమెకు కాల్ చేసి మాట్లాడానని చెప్పినట్టు ఆవాజ్-ది వాయిస్ నివేదించింది. జులేఖను కలవకుండానే తాను చనిపోతానని, ఆ తర్వాత తాను చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె తన భయాలను అంగీకరించింది.
గత వారం ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. ఇరువురు తమ బాగోగులు పంచుకున్నారు. ఈ క్రమంలోనే నిషా ఉంగరం గురించి చెప్పగా, తనకు గుర్తులేదని జులేఖ చెప్పింది. కానీ, ఆ విషయం గుర్తు చేయడంతో పాటు ఉంగరం కథను మొత్తం వివరించింది. దానికి సంబంధించిన డబ్బును ఇవ్వబోతుంటే జులేఖ ఒప్పుకోలేదు.. కానీ చివరకు తనకు తాను అనుభవించిన వేదనను వివరించడంతో జులేఖ తీసుకున్నారని నిషా చెప్పారు.
