హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొలేరో కారు జారుడుగా ఉన్న ప్రాంతంలో నుంచి వెళ్లుతూ లోయలోకి దూసుకెళ్లింది. లోయలోనే ఆ కారు పడి ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయాల పాలైనట్టు అధికారులు వివరించారు.
ఈ ఘటన టిస్సా తెహసీల్‌లని సత్రుండిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చంబా జిల్లాలోని మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేసినట్టు అధికారులు వివరించారు. మృతులను రాకేశ్ కుమార్, అమర్ జీత్ సింగ్, మనోహర్, రాజీవ్ శర్మలుగా గుర్తించారు. వీరంతా గురుదాస్‌పూర్‌కు చెందినవారు. కాగా, హేమ్ సింగ్ చంబా జిల్లాకు చెందిన వాసి కూడా ఈ ఘటనలో మరణించారు.
వీరంతా ఒక సర్వే కోసం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు స్థానికులు చెప్పారు. సత్రుండి దగ్గర రోడ్డు మరీ జారుడుగా ఉన్నది. వీరు ప్రయాణిస్తున్న బొలేరో కారు అక్కడికి చేరగానే డ్రైవర్‌కు కారుపై నియంత్రణ కోల్పోయింది. ఆ కారు జారుడుగా ఉన్న భూమి పై నుంచి వెళ్తూ లోయలోకే జారిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు మరణించారు. ముగ్గురు పంజాబీలతోపాటు మిగతా వారు స్థానికులే. ఇద్దరు క్షతగాత్రులు స్థానికులేనని సమాచారం.
