Asianet News TeluguAsianet News Telugu

ఐదు నెలల్లో ఐదుగురు సీనియర్ నేతలు ఔట్.. ‘మునిగే నావ.. కాంగ్రెస్’

కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు  నెలల్లో ఐదుగురు కీలక నేతలు బయటకు వెళ్లారు. ఐదు నెలల వ్యవధిలోనే వారు రాజీనామా చేశారు. తాజాగా, కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాదిలో కపిల్ సిబల్ కంటే ముందు సునిల్ జాఖడ్, హార్డిక్ పటేల్, అశ్వని కుమార్, ఆర్‌పీఎన్ సింగ్‌లు పార్టీకి రిజైన్ చేశారు.
 

five big leaders exit in five months in this year
Author
New Delhi, First Published May 25, 2022, 7:23 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఈ ఏడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నేతల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ సంఖ్య ఇలాగే ఇంకా పెరిగేలా కనిపిస్తున్నది. కాంగ్రెస్‌లో అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టుకుని బీజేపీని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న ఈ హస్తం పార్టీకి సీనియర్ నేతల వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే ఐదుగురు వెటరన్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ వివరాలు చూద్దాం.

కపిల్ సిబల్: ప్రముఖ న్యాయవాది, రాజకీయ నేత కాంగ్రెస్‌లో అనతి కాలంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. కానీ, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పార్టీ నేత సంబంధాలు దారుణంగా దిగజారిపోయాయి. ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన సదస్సులో ఆశించిన మార్పులు రాకపోవడంతో ఈ జీ23 గ్యాంగ్ సభ్యుడు అసహనానికి లోనయ్యాడు. కాంగ్రెస్ నాయకత్వం కోయిల గానాలు మాత్రమే వినిపించే చోట ఉన్నదని విమర్శించాడు. కాంగ్రెస్‌లో సమూల మార్పులు.. ప్రక్షాళన గావించాలని డిమాండ్ చేస్తున్న 23 కాంగ్రెస్ విమర్శకుల్లో కపిల్ సిబల్ కూడా ఉన్నాడు.

సునిల్ జాఖడ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా ఇదే నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై చేసిన విమర్శలకు గాను షోకాజ్ నోటీసును కాంగ్రెస్ సునీల్ జాఖడ్‌కు పంపింది. ఆయన బీజేపీలో చేరాడు. కాంగ్రెస్ నాయకత్వం మిత్రులెవరో, శత్రులెవరో గుర్తించాల్సి ఉందని విమర్శించాడు

హార్దిక్ పటేల్: పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని పేర్కొంటూ గుజరాత్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ టాప్ లీడర్లు తనను కలిసినప్పుడు మొబైల్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని విమర్శించాడు. అంతేకాదు, గుజరాత్ కాంగ్రెస్ యూనిట్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా నాయకత్వానికి చికెన్ సాండ్విచ్‌లు అందించడంపైనే దృష్టి ఎక్కువ అని ఆరోపించాడు.

అశ్వని కుమార్: మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్ నాలుగు దశాబ్దాల అనుబంధం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేశాడు. తన డిగ్నిటీని కాపాడుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనియా గాంధీకి రాసిన లేఖలో అశ్వని కుమార్ పేర్కొన్నాడు. సమీప భవిష్యత్‌లో కాంగ్రెస్ మరింత పతనం అవుతున్నట్టుగానే కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డాడు.

ఆర్‌పీఎన్ సింగ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్ పార్టీకి రాజీనామా చేశాడు. బీజేపీలోకి వెళ్లాడు. తాను పార్టీలో 32 సంవత్సరాలు ఉన్నారని వివరించాడు. కానీ, పార్టీలో చాలా మార్పులు వచ్చాయని, ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు పార్టీ లేదని తెలిపాడు. గతేడాది పార్టీ నుంచి జితిన్ ప్రసాద బీజేపీలోకి వెళ్లిన తర్వాత పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్ ఆర్‌పీఎన్ సింగ్.

Follow Us:
Download App:
  • android
  • ios