కేరళలో 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక యూదుల పెళ్లి జరిగింది. అమెరికాలో డేటా సైంటిస్టుగా చేస్తున్న భారత మూలాలు గల రాచెల్ బినోయ్ మలాఖి, అమెరికా పౌరుడైన నాసా ఇంజినీర్ రిచర్డ్ జచారీ రోవ్‌లు ఆదివారం యూదుల సాంప్రదాయ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. 

Kochi: కేరళలో యూదుల పెళ్లి జరిగి 15 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ తాజాగా ఇక్కడ యూదుల పెళ్లి జరిగింది. రాచెల్ బినోయ్ మలాఖీ, రిచర్డ్ జచారీ రోవ్‌లు యూదుల సాంప్రదాయంలో ఆదివారం ఒక్కటయ్యారు.

కేరళ రాజధాని తిరువనంతపురం మూలాలు గల రాచెల్ ప్రస్తుతం యూఎస్‌లో డేటా సైంటిస్టుగా చేస్తున్నారు. అమెరికా పౌరుడైన రిచర్డ్ నాసాలో ఇంజినీర్. వీరిద్దరికి యూదుల సాంప్రదాయంలో రబ్బీ పెళ్లి చేశారు. రబ్బీ అంటే యూదుల మత బోధకుడు లేదా గురువుగా భావించవచ్చు.

రాచెల్, రిచర్డ్‌ల పెళ్లి జరిపించడానికి రబ్బీ ఏరియల్ షారోన్ ఇజ్రాయెల్ నుంచి కేరళకు విచ్చేశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వీరిద్దరికి పెళ్లి చేశారు. ఈ జంట పెళ్లి చేయడానికి తాను ఇక్కడకు వచ్చానని, ఈ పెళ్లి యూదుల సాంప్రదాయం ప్రకారం జరుగుతుందని ఆయన పెళ్లి వేడుకకు ముందు తెలిపారు.

యూదుల బైబిల్‌ (హిబ్రూ బైబిల్) లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి యూదుల సాంప్రదాయ పెళ్లి తంతు ఉంటుందని రబ్బీ తెలిపారు. సాధారణంగా ఇది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు దేవుడితో కలిసి పెళ్లి ప్రమాణం చేస్తారని వివరించారు. వారిద్దరు ఆలుమగలుగా కలిసి ఉంటామని దేవుడి సమక్షంలో ప్రమాణం చేయడమే ఈ సాంప్రదాయంలో కీలకమైన విషయం అని చెప్పారు. 

క్రైం బ్రాంచ్ మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస బినయ్ మలాఖాయ్ కూతురే రాచెల్. రిచర్డ్ నాసాలో పని చేస్తున్న అమెరికా పౌరుడు.

ఈ పెళ్లి వేడుకకు బంధు మిత్రులు, యూదు కమ్యూనిటీ సభ్యూలూ హాజరయ్యారు.

కొచ్చిలో యూదు కమ్యూనిటీ సభ్యులు 25 మంది ఉన్నారు. వారు చివరి సారి 2008లో పెళ్లి వేడుక నిర్వహించారు. రిచర్డ్, రాచెల్ పెళ్లికి మరో ప్రాముఖ్యత ఉన్నది. యూదుల పెళ్లి సాధారణంగా యూదుల మత ప్రార్థనా సమావేశం లేదా మత పరమైన భవనంలో జరుగుతుంది. కానీ, రిచర్డ్, రాచెల్ పెళ్లి ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జరిగింది. యూదు కమ్యూనిటీ సభ్యులు, బంధు మిత్రుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రైవేట్ రిసార్ట్‌లో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఒకప్పుడ కొచ్చిలో యూదుల జనాభా అధికంగా ఉండేది. కానీ, కమ్యూనిటీ సభ్యులు ఇజ్రాయెల్‌కు వెళ్లిపోవడంతో ఇక్కడ వీరి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కేరళలో శాశ్వతంగా నివాసముంటున్న యూదులు 25 మంది మాత్రమే ఉన్నారు. సుమారు 2000 ఏళ్ల క్రితం సోలోమాన్ రాజుగా ఉన్న కాలంలో వివిధ దేశాల నుంచి యూదులు ఇక్కడికి వలస వచ్చారు. ఆ తర్వాత వారి కమ్యూనిటీ ముంబయి, కోల్‌కతా వంటి నగరాలకూ వ్యాప్తి చెందింది. కానీ, యూదుల కోసం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డ తర్వాత చాలా మంది ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు తరలి వెళ్లిపోయారు.

యూదుల సాంప్రదాయం ప్రకారం, పెళ్లి వేడుకలో కనీసం పది మంది యూదులు ఉండటం తప్పనిసరి. కేరళలో గత 70 ఏళ్లలో కేవలం నాలుగు యూదు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయి. చివరిసారిగా కేరళలో యూదుల పెళ్లి 2008 డిసెంబర్ 18వ తేదీన జరిగింది.