దేశంలో తొలి కరోనా నాసల్ వ్యాక్సిన్ .. జనవరి 26 నుంచి అందుబాటులోకి .. దాని ధర ఎంతంటే?
దేశంలో తొలి భారతీయ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ (iNCOVACC)జనవరి 26 న ప్రారంభించబడుతుంది. దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ జనవరి 26న భారతదేశంలో ఈ రకమైన మొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు.
కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలకుతలం చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫార్మా కంపెనీలు, వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక వ్యాక్సిన్‌లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అయినా.. ఆ మహమ్మారిని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి నూతన ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మరో ఆవిష్కరణ చేసింది.
దేశంలో తొలి భారతీయ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంకోవాక్ (iNCOVACC)ను జనవరి 26న ఆవిష్కరించనున్నది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. భోపాల్‌లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వాక్సిన్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అలాగే..పశువులలో లంపీ-ప్రోవింద్ అనే దేశీయ వ్యాక్సిన్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ యొక్క నాసల్ వ్యాక్సిన్‌ను 23 డిసెంబర్ 2022న ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా ఉపయోగించవచ్చు. తొలుత ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాసికా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. భారతదేశం యొక్క కోవిడ్ 19 టీకా కార్యక్రమంలో ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను కూడా చేర్చింది. అంతకుముందు.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI, అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను ముక్కు ద్వారా స్ప్రే చేయడం ద్వారా ఇవ్వబడుతుంది. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి చేతిపై వ్యాక్సిన్ వర్తించదు. 18 ఏళ్లు పైబడిన వారు ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని DCGI ఆమోదించింది.
నాసికా వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?
కరోనాతో సహా చాలా వైరస్‌లు శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. శ్లేష్మం అనేది ముక్కు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలో కనిపించే జీగట(అంటుకునే) పదార్థం. నాసికా వ్యాక్సిన్ నేరుగా శ్లేష్మ పొరలో రోగనిరోధక శక్తిని సృష్టిస్తుంది. ఇది ప్రారంభంలోనే ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించగలదు. AIIMS మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ.. నాసికా వ్యాక్సిన్ వేయడం చాలా సులభం. ఇది శ్లేష్మంలోనే రోగనిరోధక శక్తిని సృష్టిస్తుంది, ఇది ప్రారంభ దశలో వైరస్ ను గుర్తించి.. నిరోధించగలదని చెప్పారు. ప్రభుత్వానికి ఒక డోసును రూ.325కు అమ్ముతామని, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు ఒక డోస్ ను రూ.800 చొప్పున విక్రయిస్తామని తెలిపారు.
ఈ వ్యాక్సిన్‌ని ఎవరు తీసుకోవచ్చు?
ఈ వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే తీసుకోవాలి.12 నుండి 17 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు వేయబడుతున్నాయి, కానీ వారికి పూర్తి డోస్ ఇవ్వరు.రెండవ విషయం ఏమిటంటే.. ఇది బూస్టర్ డోస్ గా పని చేస్తుంది. అంటే..రెండు డోస్‌లు తీసుకున్న వారు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ని పొందగలరు.
అదే సమయంలో దీనిని ప్రైమరీ వ్యాక్సిన్ గా కూడా తీసుకునే ఆమోదం లభించింది. అంటే.. ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోయినా.. వారు దీనిని పొందవచ్చు. అయినప్పటికీ..భారతదేశంలో దాదాపు మొత్తం జనాభాకు టీకాలు వేయడం జరిగింది. కానీ ఇప్పటికీ పెద్ద మొత్తంలో బూస్టర్ డోస్ తీసుకోలేదు. కోవిన్ పోర్టల్ ప్రకారం..దేశంలో 95.11 కోట్ల మందికి పైగా ప్రజలు రెండు మోతాదులను తీసుకున్నారు. కానీ 22 కోట్ల మంది మాత్రమే బూస్టర్ డోస్ ను తీసుకున్నారు.