జంషెడ్‌పూర్: కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఓ దొంగ వంట వండుకొని తిన్న తర్వాత ఆ ఇంట్లో డబ్బులు, బంగారం దోచుకెళ్లాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి జూలై 8వ తేదీన కరోనా సోకినట్టుగా తేలింది. చికిత్స కోసం ఆయన టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇంటికి కన్నం వేయాలని భావించారు. 

ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించడం కూడ వారికి కలిసొచ్చింది. ఈ నెల 16వ తేదీ రాత్రి ఈ ఇంట్లో దొంగతనం చేశారు. దొంగలు ఇంట్లో మటన్ వండుకొన్నారు. ఆ తర్వాత ఇంట్లో రూ. 50 వేలు, రూ. 50 వేల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 

ఈ ఇంటి తలుపులు విరిగినట్టుగా గుర్తించిన స్థానికులు కరోనా సోకిన రోగి సోదరుడికి సమాచారం ఇచ్చారు. దీంతో అతను ఇంటికి వచ్చి చూస్తే దొంగతనం జరిగిన విషయం తేలింది.

కరోనా సోకిన రోగి భార్య, పిల్లలు తమ స్వంత గ్రామంలో ఉంటున్నారు. భర్తకు కరోనా సోకడంతో పిల్లలను తీసుకొని భార్య స్వగ్రామానికి వెళ్లింది. నెల రోజుల క్రితమే ఈ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.